అవిశ్వాస తీర్మానంపై నిన్న పార్లమెంటులో చర్చ జరిగిన సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో రాష్ట్ర విభజనతో నష్టపోయిన ప్రజలకు న్యాయం చేకూరే వరకూ పోరాటం చేయాలని తెలిపారు. కాగడాల ప్రదర్శనలు చేయడం ద్వారా, బంద్‌లు నిర్వహించడం ద్వారా సరిపెట్టుకోరాదని.. పోరాటం నిరంతరంగా చేయాలని అన్నారు. జనసేన పార్టీ చేస్తున్న పోరాట యాత్ర అలాంటిదేనని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ యాత్రలో భాగంగా పాలక పక్షాల ద్వంద్వ వైఖరిని, ప్రజలను మోసం చేస్తున్న తీరుని ఖండిస్తూ కవాతులు చేస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీతో సమానంగా రాష్ట్రంలో ఉన్న టీడీపీ కూడా అంతే దారుణంగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసిందని ఆయన అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయన్నారు. ఒకవైపు టీడీపీ ఎంపీలు బీజేపీని తిడుతూ.. ఆ తర్వాత మళ్లీ బీజేపీ కాళ్లు మొక్కుతారని పవన్ అభిప్రాయపడ్డారు. కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ చంద్రబాబును మిత్రుడని పార్లమెంటులో ప్రకటించారని.. దీనిని బట్టి సీఎం చేస్తుంది ధర్మ పోరాటం అని ఎలా నమ్మగలమని పవన్ అన్నారు. 


మార్చి 12, 2017 తేదిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీయే బెటర్ అన్నారని.. మళ్లీ అదే జయదేవ్ అవిశ్వాస తీర్మానం అప్పుడు ప్రత్యేక హోదా కావాలని అంటున్నారని.. టీడీపీకి ఏవైనా మతిమరుపు లక్షణాలు ఉన్నాయా అని పవన్ అన్నారు. ఈ సందర్భంగా జనసేన ఫేస్బుక్ పేజీలో పోస్టు కూడా పెట్టారు. అయిదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను ఢిల్లీ వరకూ వినిపించేలా మడమ తిప్పకుండా జనసేన పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.