పెందుర్తి ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్
విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ఒక దళిత మహిళపై జరిగిన దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ఒక దళిత మహిళపై జరిగిన దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నాయకులు ఆమెను హింసించారని, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను నేరుగా వస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడండి. గతంలో కారంచేడు, చుండూరు ఘటనల్లోనూ ఇలానే జరిగింది. ఈ ఘటనలు పునరావృతం అవ్వకూడదని సంయమనం పాటిస్తున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఈ ఘటన విని నేను తీవ్రంగా కలత చెందాను. దీనిపై ప్రభుత్వం వద్ద నుండి వివరణ అడుగుతున్నారు ప్రజలు. ఇలాంటి దాడులపై పోలీసులు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పవన్ తెలిపారు. ప్రభుత్వం అధికారులతో పాటు కులపెద్దలు కూర్చొని శాంతియుతంగా చర్చలు జరిపి వివాదంపై పరిష్కారం చూపాలని కోరారు. ఈ ఘటనను మీడియా సెన్షేషన్ చేయకుండా బాధ్యాతాయుతంగా వ్యవహరించాలని మీడియాను పవన్ కోరారు.
విశాఖపట్నం కలెక్టర్, పోలీస్ కమిషనర్ బాధితురాలికి అండగా నిలబడి సత్వర న్యాయం అందించాలని కోరారు. త్వరలోనే జనసేన పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్లి బాధితురాలిని పరమార్శించి.. అక్కడ ఏమి జరిగిందో అడిగి తెలుసుకుంటారు. ఐరోపా, అమెరికా దేశాల నుండి వివిధ కమ్యూనిటీలకు చెందిన మహిళలు బాధితురాలికి మద్దతుగా నిలుస్తామని నాకు సందేశాలు పంపారన్నారు. పట్టపగలు కొంతమంది వ్యక్తులు మహిళపై దాడి చేశారు. ఆమె ఏ వర్గానికి చెందిన మహిళ అయినా సరే.. కారణం ఏదైనా కావచ్చు.. అలా చేయడం మాత్రం న్యాయం కాదన్నారు.
అసెంబ్లీలో తెదేపా- భాజాపా అధికార పక్షం, ప్రతిపక్షం వైఎస్సాఆర్సీపీ ఒకరిపై ఒకరు బురదలు చల్లుకోవడం మాని.. ఇలాంటి ఘటనలు, దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు కలిసికట్టుగా చర్చలు జరిపి ఒక పరిష్కారం చూపాలన్నారు.