విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయిలో క్రమక్రమంగా పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుండగా మరోవైపు సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ.. బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో నేడు బీజేపి, జనసేన పార్టీల మధ్య ఓ కీలక సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం తమ పార్టీ బీజేపీతో కలిసి జత కట్టనున్నట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో జనసేన పార్టీ మరోసారి బీజేపికి మద్దతు పలికినట్టయింది. 2014 ఎన్నికల్లో బీజేపికి సంపూర్ణ మద్దతు పలికిన పవన్ కల్యాణ్... ఆ తర్వాత బీజేపి ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిందేమీ లేదంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అనేక వేదికలపై మోదీ సర్కార్‌ని తీవ్రస్థాయిలో ఏకిపారేసిన పవన్ కల్యాణ్... తాజాగా ఢిల్లీలో బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డాను కలిశారు. 


ఈ భేటీ అనంతరం తిరిగి ఏపీకి వచ్చిన పవన్ కల్యాణ్ కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 16న విజయవాడలో బీజేపీతో ఓ కీలక భేటీలో పాల్గొననున్నట్టు తెలిపారు. అప్పుడు చేసిన ప్రకటన ప్రకారమే గురువారం విజయవాడలో బీజేపీ నేతలతో భేటీ అయిన పవన్ కల్యాణ్... ఆ పార్టీతో కలిసి పనిచేస్తున్నట్టు స్పష్టంచేశారు.