ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు రూ.1400 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాబార్డు ద్వారా రూ. 1400 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు అనుమతి లభించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అయ్యే వ్యయం లోంచి రూ. 1795 కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అప్పట్లో ఏపీ సర్కార్ చేసిన ఈ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రం.. నాబార్డు ద్వారా రూ. 1400 కోట్లు రుణం మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది. ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర జలవనరుల శాఖ ఓ లేఖను పంపించినట్టు తెలుస్తోంది. 
 
ఏపీ సర్కార్ అడిగిన మొత్తంలో మిగతా రూ. 300 కోట్లను ప్రాజెక్టుకు సంబంధించి ఆడిట్లు వచ్చిన తర్వాత  మంజూరు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. ఓవైపు ఆంధ్రాకు ప్రత్యేక హోదా సాధన కోసం ఆ రాష్ట్రం నుంచి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్‌లో తమ గళం వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంపై ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తంకానున్నాయో వేచిచూడాల్సిందే మరి!