తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై రాయలసీమ పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం తాడిపత్రి ఘటనలో జేసీ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉందని.. పోలీసు వ్యవస్థను కించపరిచేలా ఆయన మాట్లాడారని పలువురు ఆరోపించారు. ప్రబోధానంద ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ.. జేసీ పోలీసులపై కూడా విరుచుకుపడ్డారు. వారిని అనరాని మాటలు అంటూ.. అసభ్యపదజాలంతో కూడా దూషించారు. ఈ అంశంపై సీఐ గోరంట్ల యాదవ్ స్పందించారు. తాము రాజకీయ నాయకుల కొమ్ము కాయడానికి ఈ ఉద్యోగంలోకి రాలేదని.. అసభ్యపదజాలంతో తామూ మాట్లాడగలమని.. జేసీ దివాకర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే జేసీ నుండి క్షమాపణను డిమాండ్ చేస్తూ.. పోలీసుల అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతలు బాగుంటేనే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని.. రాత్రనకా పగలనకా కష్టపడుతూ శాంతి పరిరక్షణ కోసం పాటుపడే పోలీసులను దూషిస్తే సహించేది లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారని.. కానీ జేసీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ఆయన తెలిపారు. 


తాడిపత్రిలో ప్రబోధానంద ఆశ్రమవాసులు తమ వర్గీయుల పై దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు కానీ.. ఏమీ చేయలేదని మాట్లాడుతూ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవలే వారిని దూషించారు. ఇదే క్రమంలో నోరు జారారు. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ మాటలే ఇప్పుడు జేసీని ఇబ్బందిలోకి నెట్టేశాయి. ఆయన ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని.. జేసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాయలసీమ పోలీసులు డిమాండ్ చేశారు.