డబ్బులివ్వలేదని జేసీ దివాకర్‌రెడ్డికి నాపై కక్ష: ప్రభోదానంద
అనంతపురంలోని తాడిపత్రిలో ఇటీవలే ప్రబోధానంద వర్గీయులకు, జేసీ వర్గీయులకు మధ్య గొడవ జరిగిందన్న సంగతి తెలిసిందే.
అనంతపురంలోని తాడిపత్రిలో ఇటీవలే ప్రబోధానంద వర్గీయులకు, జేసీ వర్గీయులకు మధ్య గొడవ జరిగిందన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంపై ప్రభోదానంద ఆఖరికి బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన జేసీపై తీవ్ర విమర్శలు చేశారు. 2003లో తమ మందిరం ప్రారంభానికి జేసీని ఆహ్వానించామని.. ఆ తర్వాత ఆయన పార్టీ కోసం డబ్బులడిగారని.. తాము ఇవ్వలేదు కాబట్టే తనపై కక్ష కట్టారని ప్రభోదానంద ఆరోపించారు. ఆ తర్వాత జేసీ తమను ఎన్నో వేధింపులకు గురిచేశారని ఆయన తెలిపారు. ఇవే కక్షలను మనసులో పెట్టుకొని..కావాలనే ప్రజలను తమ భక్తులపైకి రెచ్చగొట్టారని ప్రభోదానంద చెప్పిన్నట్లు పలు వెబ్ పత్రికలు రాశాయి.
తాము ప్రచారం కోసం పాకులాడేవాళ్లం కాదని.. తమ ఆశ్రమానికి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారని.. తాము అక్రమాలు చేస్తే వారెలా వస్తారని ప్రభోదానంద ప్రశ్నించినట్లు సమాచారం. జేసీ తనను డైరెక్ట్‌గా ఎదుర్కోవడం చేతకాకే.. ఇలా కుయుక్తులు పన్నుతున్నారని ప్రబోధానంద ఆరోపణలు చేశారు. తమకు బెంగళూరులో కూడా ఆశ్రమం ఉందని.. అక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని.. ఇక్కడే ఇబ్బంది ఎదురైందని ఆయన అన్నారు.
కాగా.. ప్రస్తుతం ప్రబోధానంద ఆశ్రమం విషయం గురించి మరింత సమాచారం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మీదట జెసి-2 సుబ్బరాజు, ఆర్డీవో మలోలా, డీఎస్పీ విజయ్‌కుమార్‌లతో కూడిన కమిటీ ఆశ్రమాన్ని సందర్శించింది. అలాగే స్థానికుల నుండి కూడా ప్రస్తుతం సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ ఆశ్రమం వల్ల ప్రజలు ఏవైనా ఎదుర్కొంటున్నారా? లేదా? లాంటి విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. తాడిపత్రిలోని చినపొడమల గ్రామంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం జరుగుతున్న క్రమంలో ప్రబోధానంద భక్తుల మధ్య.. గ్రామస్తుల మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి.. ఆక్టోపస్ వారినే రప్పించిందంటే దాని తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదే గొడవలో జేసీ పోలీసులపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు.