Draupadi Murmu Tirupati Tour: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విశాఖపట్నంలో ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు ఐఎన్ఎస్ డేగాలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం విశాఖపట్నం చేరుకొని ఆర్.కె. బీచ్‌లో నిర్వహించిన నౌకాదళ దినోత్సవంలో ద్రౌపది ముర్ము పాల్గొన్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం జిల్లాలో పలు కార్యక్రమాలు ముగించుకొని ఐఎన్ఎస్ డేగ విమానాశ్రయానికి చేరుకొన్న భారత రాష్ట్రపతి.. రాత్రి 7.42 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి బయలుదేరి వెళ్ళారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఐఎఎస్ డేగాలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజనీ, ఫైర్ సర్వీస్ డి.జి.పి. ఎన్. సంజయ్, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, సీపీ సిహెచ్ శ్రీకాంత్, నేవీ అధికారులు, తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.



 


ఇదిలావుంటే ఏపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయల్దేరిన ద్రౌపది ముర్ముకి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం అధికారులు ద్రౌపది ముర్మును తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి తీసుకువెళ్లారు. ఆదివారం రాత్రి అక్కడే బస చేయనున్న ఆమె.. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరిగి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.