అమరావతి: కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించిన అనంతరం సీడబ్ల్యూసీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే మార్గం సుగుమం చేయడం కోసం ఆ పార్టీ నేతలు తమ పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వీహెచ్ వంటి నేతలు తమ పదవులకు రాజీనామాను సమర్పించాగా.. తాజాగా ఏపీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. 


అయితే, కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ మాత్రం రఘువీరా రెడ్డి రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలుస్తోంది. కాకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతల రాజీనామా చేస్తున్న ప్రస్తుత తరుణంలో కాస్త ఆలస్యమైనా.. రఘువీరా రెడ్డి రాజీనామాను సైతం పార్టీ హైకమాండ్ ఆమోదిస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.