తెలంగాణ ఎన్నికలు: ఒకే వేదికపై రాహుల్-చంద్రబాబు..?
ఒకే వేదికను పంచుకోనున్న రాహుల్-చంద్రబాబు..?
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఒకే వేదిక పంచుకోనున్నారా..? అవుననే అంటున్నారు కొంతమంది కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు..
ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టిడిపి, టిజెఏసి, సిపిఐ పార్టీలు కలిసి "మహా కూటమి"ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పార్టీతో టిడిపితో పొత్తు విషయమై రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం. వీలయితే.. టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కలిసి బహిరంగ సభల్లో వేదికను పంచుకోవాలని కూడా రాహుల్ యోచిస్తున్నారట. నవంబరులో బాబు-రాహుల్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పోలింగ్ తేదీకి ముందు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. రాహుల్ గాంధీ, చంద్రబాబుతో మహకూటమి భాగస్వాములు కోదండరాం (తెలంగాణ జన సమితి), చాడా వెంకట్ రెడ్డి (సిపిఐ) కూడా వేదిక పంచుకుంటారని.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ నిర్వహిస్తోందని స్థానిక మీడియా పేర్కొంది.
మరోవైపు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. నెలాఖరులోగా రెండు విడతలుగా తెలంగాణలో రాహుల్ పర్యటించనున్నారు. అక్టోబర్ 20 న కామారెడ్డి, బోధ్ సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు. మళ్ళీ అక్టోబర్ 27న కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో జరిగే సభలో పాల్గొంటారు.
రాహుల్-చంద్రబాబు ఒకేవేదిక పంచుకుంటే.. అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఓట్లు కాంగ్రెస్ కు ట్రాన్స్ ఫర్ అవుతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.