అమరావతి: ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందే జన సేన పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు నిన్న శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అటు లోక్ సభ ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం చవిచూడటంపై తీవ్ర అసంతృప్తి చెందిన కారణంగానే రావెల పార్టీని వీడినట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు టీడీపిలో చేరిన రావెల ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో ఓ మహిళపై దాడి, కిడ్నాప్ యత్నం కేసులో రావెల తనయుడి పేరు వినిపించడంతో ఆయన తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం కొద్దిరోజులకే రావెలకు చంద్రబాబు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికారు. ఆ తర్వాత టీడీపీలో నామమాత్రపు పాత్రకే పరిమితమైన రావెల సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. టీడీపీలో తనకు అవమానం జరిగినందునే తాను పార్టీ మారుతున్నానని అప్పట్లో జనసేన సభా వేదికపై నుంచి స్పష్టంచేసిన రావెల కిషోర్ బాబు తాజాగా ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు.


ఇదిలావుంటే, జనసేన పార్టీని వీడిన రావెల కిషోర్ బాబు ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. రావెలతోపాటు పార్టీలో చేరనున్న ఇంకొందరు నేతలకు ప్రధాని మోదీ స్వయంగా కండువా కప్పి సాదర స్వాగతం పలకనున్నట్టు సమాచారం.