కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఏమైనా పునరాలోచనలో పడిందా ? లేదంటే, ఏపీ రాజధాని నుంచి తాము ఇచ్చిన రాజీనామా వార్నింగ్‌కి హస్తినలో వున్న కేంద్రంలో ఏమైనా కదలికలు వస్తాయని టీడీపీ ఆశిస్తుందా ? చిట్టచివరిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందన కోసం వేచిచూస్తున్నారా ? అంటే అవుననే టాక్ కూడా వినిపిస్తోంది. అందుకు కారణం కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా బుధవారం రాత్రి హడావుడిగా ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఆ నిర్ణయాన్ని గురువారం సాయంత్రం వరకు ఆచరణలో పెట్టకపోవడమే. అవును, తెల్లవారితే, అంటే గురువారమే కేంద్ర కేబినెట్‌లో కొనసాగుతున్న తమ ఇద్దరు టీడీపీ ఎంపీలు కేంద్ర కేబినెట్ పదవులకు రాజీనామా చేస్తారు అని బుధవారం రాత్రి ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ గురువారం మాత్రం మరోసారి ఆఖరిగా, మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిసి, ఆ తర్వాత రాజీనామా చేస్తారని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర కేబినెట్‌లో మంత్రులుగా వున్న ఇద్దరు టీడీపీ ఎంపీలైన అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలకు సాయంత్రం 4 గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు సమాచారం. ప్రధానితో భేటీ అయిన తర్వాత ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయనున్నారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. 


అయితే, వాస్తవానికి ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని, రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్రం ఏపీని నిర్లక్ష్యం చేసి ఇచ్చిన మాట తప్పిందనే కారణాలతోనే టీడీపీ కేంద్ర కేబినెట్‌పై నిరసన వ్యక్తంచేస్తూ పక్కకు తప్పుకుంటోంది. అందులోనూ ఇదేం అప్పటికప్పుడు అర్ధరాత్రి తీసుకున్న అనుకోని నిర్ణయం ఏమీ కాదు. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి నిత్యం నిరసనలు జరుగుతున్న సంగతి కేంద్రానికి తెలియనిది కాదు. అయినప్పటికీ ఇంకోసారి మర్యాదపూర్వకంగా కేంద్రాన్ని కలిసి, ఆ తర్వాతే రాజీనామా చేయాలని అనుకుంటున్నారంటే, కేంద్రం తమ నిర్ణయం మార్చుకుంటుందని టీడీపీలో ఇంకా ఎక్కడో చిన్న ఆశ వున్నట్టుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.