తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 216వ నెంబర్‌ జాతీయ రహదారిపై గొల్లప్రోలు - చేబ్రోలు మధ్య ఓ టిప్పర్, టాటా మ్యాజిక్‌ వేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో మొత్తం ఎనిమిది మంది దుర్మరణంపాలయ్యారు. కాకినాడ వైపు నుంచి వెళ్తున్న టాటామ్యాజిక్‌ వాహనాన్ని చేబ్రోలు సమీపంలోని బైపాస్‌ రోడ్డు మీద ఎదురుగా వచ్చిన టిప్పర్‌ వేగంగా ఢీకొట్టింది. మృతుల్లో ఆరుగురు ఘటనాస్థలంలోనే చనిపోగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టిప్పర్ వేగానికి టాటా మ్యాజిక్ వాహనం నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. క్షతగాత్రులకు పిఠాపురంలో ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. 


ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారిలో విశాఖ జిల్లా మాకవరంపాలెం మండలం జి.వెంకటాపురం గ్రామస్తులే అధికంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో టాటా మ్యాజిక్‌ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్న వాళ్లంతా కాకినాడలో తమ బంధువుల ఇంటికి గృహప్రవేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో సబ్బవరపు వరహాలు, సబ్బవరపు పాప, సబ్బవరపు పైడిపెల్లి, సబ్బవరపు అచ్చిరాజు, ఐలా లక్ష్మి, గౌరెడ్డి రాము, డ్రైవర్‌ ఆల సంతోష్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.