గుంటూరులో రౌడీ షీటర్ దారుణ హత్య
ఆదివారం రాత్రి జరిగిన ఘటన గుంటూరు నగరంలో కలకలం సృష్టించింది. మాజీ రౌడీ షీటర్ బసవల వాసు(38)ను అతి దారుణంగా నరికి చంపారు. ఇతను గుంటూరుకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే అనుచరుడు. ఇటీవల ఒక సెటిల్మెంట్ వ్యవహారంలో జైలుశిక్ష పడగా,బెయిల్ పై బయటికి వచ్చాడు. వాసు పలు హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు.
వాసు ఆదివారం రాత్రి నిత్యం రద్దీగా ఉండే అరండల్ పేట 12 వీధిలోని ఒక రెస్టారెంట్ లో భోజనం చేసి తన కారు ఎక్కేందుకు వచ్చాడు. ఇంతలో కొందరు దుండగులు కారులో అకస్మాతుగా వచ్చి వాసు కారును ఢీ కొట్టారు. కారులోంచి వాసు కిందపడ్డాడు. వెంటనే దుండగులు కారులోంచి దిగి కత్తులతో, వేటకొడవళ్లతో విచాకణారహితంగా నరికి చంపారు. 60 సెకన్లలో 40 కత్తిపోట్లు పొడిచారు. బతికి ఉన్నాడనే అనుమానంతో పీకను కోశారు. ఇంత దారుణమైన ఘటన నిమిషం వ్యవధిలో జరిగిపోయింది. దుండగులు తమనెవారూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్కులు, గుడ్డలు కప్పుకున్నారు.
ఘటన జరిగిన స్థలాన్ని అర్బన్ ఎస్పీ పరిశీలించారు. అనుమానితులుగా ఉన్న కొందరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు.