కవితాలోకాన కల్పవల్లి.. దేవులపల్లి
ఆయన కవిత్వంలో భావుకత్వం వెల్లివిరుస్తుంది.. ఆయన రాసే గీతాల్లో లాలిత్యం పాఠకులను తన్మయత్వంలో మునిగితేలేలా చేస్తుంది. తెలుగు కవిత్వ లోకాన ఆయన ఓ ప్రముఖ అధ్యాయం. తెలుగు సినిమా రంగాన ఆయన పాటలు జగద్విఖ్యాతం. ఆంధ్రా షెల్లీగా ప్రఖ్యాతి గాంచి "కృష్ణపక్షం" వంటి గొప్ప రచనను తెలుగు పాఠకులకు అందించిన ఆ మేటి సాహితీ దురంధరుడే "దేవులపల్లి కృష్ణశాస్త్రి". ఆయన జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం మీకోసం
దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం గ్రామంలో తమ్మన్నశాస్త్రి, సీతమ్మ దంపతులకు నవంబరు 1, 1897 తేదీన జన్మించారు. అతని విద్యాభ్యాసమంతా పిఠాపురం పాఠశాలలో సాగింది. పాఠశాల రోజుల్లోనే కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం వంటి రచయితల వద్ద ఆంగ్ల సాహిత్యాన్ని ఔపోసన పట్టాడు కృష్ణశాస్త్రి. 1918లో విజయనగరం వెళ్లి డిగ్రీ చేస్తున్న రోజుల్లోనే ఆయనకు కవిత్వం రాయడం పట్ల మమకారం ఏర్పడింది. డిగ్రీ పూర్తి చేసి పెద్దాపురంలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాక ఆయన పూర్తిస్థాయిలో రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు. అవి వ్యావహారిక భాషా ఉద్యమం చురుగ్గా జరుగుతున్న రోజులు. అదే సమయంలో ఒక రోజు బళ్ళారికి రైలులో వెళ్తుండగా, కిటికీలో నుండి వాతావరణాన్ని గమనిస్తూ.. అనుకోకుండా ప్రకృతి సౌందర్యానికి ప్రేరేపితుడైన కృష్ణశాస్త్రి అక్కడిక్కడే "కృష్ణపక్షం" కావ్యానికి అంకురార్పణ చేశారు.
1922లో కృష్ణశాస్త్రి సతీమణి అర్థాంతరంగా మరణించడంతో కొన్నాళ్లు అదే బాధలో గడిపారు ఆయన. అదే బాధలో అనేక విషాద కవితలు రాశారు. ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి ఖండకావ్యాలు అలా పుట్టినవే.1929లో రవీంద్ర నాథ్ టాగుర్‌తో ఏర్పడిన పరిచయం కృష్ణశాస్త్రి జీవితాన్ని మరో మలుపు తిప్పింది. మరిన్ని కవితా రచనలను చేసేలా ప్రేరేపించింది. అదే సమయంలో తెలుగు సినీ దర్శకుడు బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో తొలిసారిగా "మల్లీశ్వరి" చిత్రానికి పాటలు రాశారు కృష్ణశాస్త్రి. "మనసున మల్లెల మాలలూగెనే..కనుల వెన్నెల డొలలూగెనే.. ఎంత హాయు ఈరేయి నిండెనో.. ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో" అంటూ సాగిన ఆ చిత్రంలోని పాటకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కృష్ణశాస్త్రి కలం కురిపించిన ప్రేమరసంలో తేలియాడారు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి.. అని భరతమాతను కీర్తించినా, జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి.. అంటూ దేశభక్తిని చాటినా.. ఆకులో ఆకునై , పువ్వులో పువ్వునై , ననులేత రెమ్మనై ,సెలయేటిలో పాటనై, తెరచాటు తేటినై , నీలంపు నిగ్గునై... అని మగువ ఆర్ద్రతకు పెద్దపీట వేసినా అది కృష్ణశాస్త్రికే చెల్లింది.
మహాకవి శ్రీశ్రీ సైతం "నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని" అని పేర్కొనడం విశేషం. విశ్వనాథ సత్యనారాయణ లాంటి మేటి సాహితీవేత్త సైతం "మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నాయభిప్రాయము" అని అన్నారట. " నేను హృదయవాదిని, నాకు వేదాంతం,తర్కం తలకెక్కవ్ ! " అని ఎప్పుడూ అంటారట కృష్ణశాస్త్రి. ఎందుకంటే.. అప్పటికే పద్యకవిత్వానికి దీటుగా వచన కవిత్వానికి పట్టం కట్టిన సాహితీ మేధావి ఆయన. అయితే ఆయన రాసిన "కృష్ణపక్షం"పై వచ్చిన విమర్శలు కూడా అన్నీ ఇన్నీ కావు. ప్రేమకవిత్వంతో రచనా లోకాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడు కృష్ణశాస్త్రి అన్నవారు కూడా ఉన్నారు. అయితే అదే కవిత్వంపై తర్వాతి రోజులలో ఎందరో పీహెచ్‌డీ చేయడం విశేషం.
అమృతవీణ, శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, శ్రీ విద్యావతి (శృంగార నాటికలు), మహతి కృష్ణశాస్త్రి రాసిన ఇతర రచనలు. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కృష్ణశాస్త్రిని "కళాప్రపూర్ణ"తో సత్కరించింది. 1976లో భారత ప్రభుత్వం "పద్మభూషణ్" బిరుదుతో గౌరవించింది. 1978లో కృష్ణశాస్త్రి రచనలకు గాను ప్రఖ్యాత సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వరించడం విశేషం. తెలుగు నాట భావకవుల ప్రతినిధిగా అనేక సంవత్సరాలు తిరుగులేని రచయితగా వెలుగొందిన దేవులపల్లి స్వరం 1963 సంవత్సరంలో అనారోగ్యం వల్ల మూగబోయింది. ఆ తర్వాత ఆయన పెద్దగా రచనలు చేయలేదు. ఫిబ్రవరి 24, 1980న కృష్ణశాస్త్రి యావత్ తెలుగు సాహితీ లోకాన్ని విడిచి తరలిరాని లోకానికి వెళ్లిపోయారు.