విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టులో చేపట్టిన రివర్స్ టెండరింగ్‌ ప్రక్రియపై బీజేపి ఎంపి జీవిఎల్ నరసింహా రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 200 కోట్లు ఆదా అయిందంటే అది ఆహ్వానించదగిన పరిణామమే అవుతుందని జీవీఎల్‌ నరసింహ రావు అన్నారు. తక్కువ వ్యయంతో పోలవరం నిర్మిస్తామంటే కేంద్రానికి అభ్యంతరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఈ సందర్భంగా కేంద్రం వంద రోజుల పాలనపై స్పందించిన జీవిఎల్.. ఈ వంద రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. కార్పొరేట్‌లో పన్ను తగ్గింపుతో పెట్టుబడులు వస్తాయని.. ఫలితంగా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తుందని చెబుతూ.. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.