ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణం మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ షేక్ జానీమూన్ రిలే నిరాహారదీక్షకు కూర్చున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోనే ఆమె దీక్షకు కూర్చున్నారు. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాకపోతే.. తాను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని ఆమె తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు’ అనే స్లోగన్ రాసి ఉన్న బోర్డును చేతిలో పట్టుకొని ఆమె దీక్షకు కూర్చున్నారు. ఆమె దీక్షకు పలువురు జిల్లా పరిషత్ అధికారులు సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక ముగింపు అనేది లభిస్తుందని.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఆమె కోరారు


ముఖ్యంగా జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల‌కు నిధులు ఇవ్వకపోవడంతో పాటు విభజన హామీ చట్టంలోని అంశాలను పరిగణనలోకి కేంద్రం ప్రభుత్వం తీసుకోవడం లేదని.. ఇప్పటికైనా కేంద్రం చొరవ తీసుకొని రాష్ట్ర ప్రజల సమస్యలను అన్నింటినీ తీర్చాలని.. అప్పటి వరకూ తాను నిరాహార దీక్ష చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా షేక్ జానీమూన్ తెలియజేశారు. షేక్ జానీమూన్ గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా గతంలో వార్తల్లోకెక్కారు.