విజయవాడ/అమరావతి: ప్రత్యేక హోదా ఇక లేనట్లేనని తేలిపోయింది. ఇకముందు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండబోదని కేంద్రం తేల్చి చెప్పింది. జీఎస్టీ తర్వాత హోదా కలిగిన రాష్ట్రాలకూ పన్ను మినహాయింపులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదా,రెవెన్యూ లోటుతో పాటు పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీతో చర్చించేందుకు వెళ్లిన ఏపీ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. జైట్లీతో జరిగిన భేటీలో ప్రత్యేక హోదా సాధ్యంకాదని, ప్యాకేజీ మాత్రమే ఇస్తామని జైట్లీ స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. తాజా పరిణామాల పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలను, బీజేపీతో పొత్తు కొనసాగింపు, విభజన అంశాలపై విపులంగా చర్చించారు.. బీజేపీతో సంబంధాలు కొనసాగించే విషయంలో టీడీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అభిప్రాయాలు కోరారు.  భాజపాతో కలసి నడవడం వల్ల ఇక ఏ మాత్రం ప్రయోజనం లేదని, తక్షణం తెగతెంపులు చేసుకుందామని 95  శాతానికిపైగా తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం అంటూ ప్రకటించారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే క్రమంలోనే కీలకమైన ఈ అంశంపై స్పష్టత ఇస్తానని ప్రకటించారని సమాచారం.


పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయంతో ఇంతకాలం కేంద్రంతో సంబంధాల విషయంలో సంయమనం పాటిస్తూ వచ్చానని, 29 సార్లు ఢిల్లీకి వెళ్లి ఎప్పటికప్పుడు విభజన హామీలను గుర్తుకుతెస్తున్న పరిష్కారం కావటంలేదన్నారు. ప్యాకేజీ వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయనడంతో దానికీ ఒప్పుకున్నా ఫలితం లేకపోయిందని.. అందుకే ప్రత్యేక హోదావైపు దృష్టి మరల్చకతప్పలేదన్నారు. ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లెక్కలతో సహా విడమరిచి చెప్పాలని పిలుపునిచ్చారు. వాజ్‌పేయ్‌ ఉన్నప్పటి సానుకూల వాతావరణం ప్రధాని మోదీ హయాంలో లేకపోవడం దురదృష్టకరమన్నారు.


దొందూ దొందే


రాష్ట్ర విభజన ఏకపక్షంగా జరిగిందని, ఆ సమయంలో రెండు జాతీయ పార్టీలు వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. రెండు ప్రాంతాలవారిని కూర్చోబెట్టి సమన్యాయం చేసివుంటే ఇప్పుడు ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదన్నారు. హైదరాబాద్‌ నగరం లేకపోవడం ఏపీకి లోటు అని అన్నారు. ఏపీ రూ.16వేల కోట్ల లోటులో ఉందని చెప్పారు. ఇది కావాలంటే కేంద్ర సహకారం వుండాలని, అందువల్లే బీజేపీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో ఉన్నామని.. ఇన్నాళ్ళూ ఓపిక పట్టామని, ఇక ఊరుకొనే  ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.


జగన్‌ది నాటకం


గతంలో జగన్మోహన్‌ రెడ్డి సమైక్యవాదం ముసుగులో వేర్పాటువాద డ్రామాలు  ఆడారని, ఇప్పుడేమో హోదా ముసుగుతో బీజేపీతో సానుకూలత నాటకం ఆడుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. జైలుకు పంపతామంటే జగన్‌ ఏ ఆట ఆడమన్నా ఆడతాడని ఎద్దేవా చేశారు. ఆనాడు కాంగ్రెస్‌ పంచానవున్న జగన్‌ ఇప్పుడు బీజేపీవైపుకి చేరాడన్నారు. ఆందోళనలు, ధర్నాలు చేస్తే హోదా రాదని, వైఎస్సార్‌సీపీ 20 సీట్లు గెలిస్తే అప్పుడు వస్తుందని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ముందు పొత్తు వుండదని, ఆ తరువాతే వారితో కలుస్తామని వైసీపీ నేతలు చెబుతున్న మాటలు ప్రజలు గమనిస్తున్నారన్నారు.