నిండు కుండలా మారిన శ్రీశైలం డ్యామ్.. 8 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల
నిండు కుండలా మారిన శ్రీశైలం డ్యామ్
శ్రీశైలం రిజర్వాయర్ నిండు కుండను తలపిస్తోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపధ్యంలో రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 883.5 అడుగులకు చేరుకుంది. దీంతో డ్యామ్ నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న అధికారులు గురువారం ఉదయం నుంచి 8వ గేటును కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ 8 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్ వైపు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను వీక్షించేందుకు పర్యాటకులు సైతం క్యూ కడుతున్నారు. ఫలితంగా క్రమక్రమంగా డ్యామ్ వద్ద పర్యాటకలు రద్దీ పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో ప్రాజెక్టులోకి వస్తోన్న వరద నీరు 2.71 లక్షల క్యూసెక్కులుగా ఉండగా విడుదలవుతోన్న నీరు 3.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టంలో నీరు 883.5 అడుగులకు చేరింది.
పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండా నీళ్లు ఉండటంతో కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరుగుతోంది.