ఆంధ్రా రైతు పొలంలో ప్రత్యక్షమైన సన్నిలియోన్ !!
దిష్టి బొమ్మలుగా మారిన సన్నిలియోన్ పోస్టర్లు
సన్నిలియోన్‌కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, దేశవ్యాప్తంగా సన్నిలియోన్ అంటే తెలియని కుర్రకారు లేరు. బయటి దేశం నుంచి వచ్చినా... పరిశ్రమలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆమె దేశవ్యాప్తంగా అభిమానులని సొంతం చేసుకుంది. సన్నిలియోన్ నటించిన సన్నివేశాలకే కాదు.. ఆమె ఫోజిచ్చిన పోస్టర్లకి కూడా అంతే క్రేజ్ వుంది. అయితే, సన్నిలియోన్‌కి వున్న క్రేజ్‌ని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ రైతు మరో కోణంలో వాడుకుంటున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.
నెల్లూరు జిల్లా బండకిందిపల్లెకి చెందిన ఏ చెంచు రెడ్డి అనే రైతు తన పొలం, చేనుల్లో సన్నిలియోన్ పోస్టర్లు ఏర్పాటు చేశాడు. అలాగని చెంచు రెడ్డి ఏమీ సన్నిలియోన్‌కి వీరాభిమాని అయ్యుండొచ్చేమో అని అనుకుంటే పొరబడినట్టే... ఎందుకంటే, అతడు సన్నిలియన్‌పై వున్న అభిమానంతో ఆ పోస్టర్లు ఏర్పాటు చేయలేదు. కాకపోతే తన ఊళ్లోవాళ్లకు సన్నిలియోన్‌పై వున్న అభిమానాన్నే చెంచు రెడ్డి మరో విధంగా వాడుకుంటున్నాడు.
సన్నిలియోన్ పోస్టర్లు ఏర్పాటు చేసిన ఆ రైతు.. ఆ పోస్టర్ల కింది భాగంలో " నన్ను చూసి ఏడవకురా " అని తాటికాయంత అక్షరాల్లో రాసిపెట్టాడు. అంటే అతడి ఉద్దేశం ఏంటో ఈపాటికే మీకు అర్థమైపోయుంటుంది. అవును, సన్నిలియోన్ పోస్టర్లని అతడు దిష్టిబొమ్మలుగా ఉపయోగిస్తున్నాడన్నమాట. సాధారణంగా పొలం మధ్యలో దిష్టిబొమ్మలు ఏర్పాటు చేయడం ద్వారా పక్షులని పంటచేనుపై వాలకుండా జాగ్రత్త పడటంతోపాటు పంటపై చెడుదృష్టి పడకుండా వుంటుందనేది రైతుల నమ్మకం. అయితే, ఇతను మాత్రం ఓ అడుగు ముందుకేసి.. ఏకంగా సన్నిలియోన్ పోస్టర్లనే ఏర్పాటు చేశాడు.
ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన చెంచు రెడ్డి.. తన ప్రయోగం సత్ఫలితాలు అందించింది అనే చెబుతున్నాడు. తన పంట చేను వద్దకొచ్చిన వాళ్లంతా.. చేను మధ్యలో వున్న సన్నిలియోన్ పోస్టర్లనే చూస్తున్నారు కానీ పంటవైపు చూడటం లేదు. అందుకే తన చేనుకి నరదిష్టి సైతం తగలడం లేదు అని ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు ఆ రైతు.