టీడీపీతో కాంగ్రెస్ పొత్తుపై బీజేపీ నేతతో చర్చించిన ఉత్తమ్ ? అనే టైటిలే వినడానికి కాస్త వింతగా ఉంది కదూ.. కానీ నిన్న ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ అనంతరం ఇదే ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు ఉండవచ్చనే ప్రచారం జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో పొత్తులపై కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మధ్య నిన్న ఆసక్తికరమైన చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్ గతంలో టీడీపీతో తమ పార్టీకి ఎదురైన గత అనుభవాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి వివరించారు. 


అయితే, లక్ష్మణ్ మాటలకు ఉత్తమ్ స్పందిస్తూ.. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే, అందరం ఏకమై కలిసి పని చేయాల్సిందేగా అని బదులిచ్చారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పూర్తయిన వెంటనే లక్ష్మణ్ సమావేశం నుంచి వెళ్లిపోతుండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా లక్ష్మణ్ ని అన్నా ఒక మాట.. ఒక నిమిషం అంటూ వెనక్కు పిలిచి మాటల్లో పెట్టిన సందర్భంలో ఇరువురి మధ్య రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సమీకరణలపై చర్చ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా వీళ్ల చర్చ ముందస్తు ఎన్నికలపై సాధ్యాసాధ్యాల గురించే జరిగినట్టు తెలుస్తోంది.