ఢిల్లీ: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి షాక్ ఇచ్చారు. ఇదివరకు టీడీపీని వీడి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల బాటలోనే తాజాగా ఆదినారాయణ రెడ్డి సైతం టీడీపీని వీడి బీజేపీలో చేరారు. సోమవారం ఉదయం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆదినారాయణ రెడ్డి బీజేపి తీర్థం పుచ్చుకున్నారు. 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ టీడీపీలో చేరారు. ఆ తర్వాత చంద్రబాబు ఆయనకు మంత్రి పదవిని సైతం కట్టబెట్టారు. జగన్ మీద దూకుడు పెంచడంతో కొద్దికాలంలోనే టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. 


రాయలసీమ రాజకీయాల్లో టీడీపీకి మరో పెద్ద దిక్కుగా ఎదిగిన ఆదినారాయణ రెడ్డి ఇలా పార్టీ మారడం చంద్రబాబుకు మింగుడుపడని పరిణామమే అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆదినారాయణ రెడ్డి.. ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ చాలా రోజులుగా ప్రచారం జరిగింది. కాగా సోమవారం నాడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు.