టీడీపీలో నందమూరి వంశం లేకుండా చేస్తున్నారు: మోత్కుపల్లి
నందమూరి ఆశయాలకు విరుద్ధంగా ప్రస్తుతం టీడీపీ నడుస్తోందని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవాలన్న ఎన్టీఆర్ ఆలోచనతో సామాన్య దళిత కుటుంబానికి చెందిన తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. ఇటీవలి కాలంలో పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మోత్కుపల్లి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన అనంతరం ఏపీ సీఎం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు.
తెలుగుదేశం జెండాను ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు లాగేసుకున్నారని మోత్కుపల్లి అన్నారు. కుట్రతో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి ఆయన చావుకు కారణమయ్యారని.. ఇప్పుడు నందమూరి కుటుంబం టీడీపీలో లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ దయవల్ల తనవంటి పేదవాళ్లు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించగలిగారని అన్నారు. తన రాజకీయ జీవితాన్ని బలి తీసుకోవాలని కుట్ర పన్నారని ఆయన అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ కూడా కుట్రలకు బలయ్యారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన బాబు.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేశారని.. కేసీఆర్ ముందే గ్రహించి ఓటుకు నోటు కేసులో పట్టుకున్నారని అన్నారు.
మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారని.. ఇప్పుడు బ్రాహ్మణుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడిని దొరకని దొంగగా అభివర్ణించారు. హోదాపై నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు హోదా నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. కుట్ర, ద్రోహం అన్నవి చంద్రబాబు నైజాలని అన్నారు. చంద్రబాబుకు ఓటేయవద్దు.. ఓడించండని ఏపీ ప్రజలకు పిలుపు నిచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా అవసరమైతే ఏపీలో తాను రథ యాత్ర చేస్తానని పేర్కొన్నారు. పురంధేశ్వరి, హరికృష్ణను బాబు రాజకీయంగా వాడుకొని వదిలేశారని, ఇప్పుడు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ సరైన వ్యక్తి అని మోత్కుపల్లి అన్నారు.