ప్రధాని నరేంద్ర మోడీ వైఖరిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... రైల్వే జోన్ విషయంలో తాము చేయడానికి ఏమీ లేదని తేల్చిచెప్పారు. '' పైవాళ్లు చేయి ఎత్తమంటే ఎత్తుతాం... దించమంటే దించుతాం. అంతకు మించి ఎంపీలు చేయడానికి ఏమీ లేదు. రైల్వే ప్రాజెక్టుల మంజూరు విషయంలో ఏం చేసినా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే చేయాల్సి వుంటుంది. అదేమీ తెలియనట్టు మీడియా వాళ్లు కూడా పదే పదే ఎంపీలని నిలదీస్తే, తాము మాత్రం ఏం చేయగలం" అని తమ నిస్సహాయతని వ్యక్తంచేశారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అంతటి ఆగని జేసీ.. ప్రధాని నరేంద్ర మోడీ అవసరాన్ని, సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబుకి అపాయింట్‌మెంట్ ఇస్తారు అని నర్మగర్భంగానే విమర్శనాస్త్రాలు సంధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సౌత్ సెంట్రల్ జోన్ పరిధిలోని విశాఖ రైల్వే జోన్ పైనే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై వున్న నేపథ్యంలో నేడు జరగనున్న ఓ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆ భేటీకి హాజరవుతూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ ఎంపీల నిస్సహాయతని స్పష్టంచేస్తున్నాయి. 


"కేంద్రం వద్ద గట్టిగా తమ వాణి వినిపించుకుని ప్రాజెక్టులు సాధించుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం లేనే లేదు కనుక దయచేసి మీడియా వాళ్లు కూడా పదే పదే ఈ విషయంలో తమని ఏమీ అడగవద్దు" అని జేసీ దివాకర్ రెడ్డి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పడం ప్రస్తుతం చర్చనియాంశమైంది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీకి చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు.. కేంద్రంపై ప్రత్యక్షంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కడంపై రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి!