సినీనటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్ శనివారం తిరుమల సందర్శించారు. తిరుమల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల తాను పొరపాటున వెంకన్న చౌదరి అని సంబోధించి తప్పు చేసినందుకు క్షమించమని స్వామి వారిని వేడుకున్నానని అన్నారు. "వేంకటేశ్వరస్వామి అనబోయి వెంకన్న చౌదరి అని పొరపాటున నోరుజారాను. ఆరోజే ఇంటికి వెళ్లాకా స్వామి వారికి క్షమాపణ చెప్పుకున్నాను. మళ్లీ ఈ రోజు ఇలా తిరుమలకు వచ్చి మరోసారి స్వామి వారిని క్షమించమని వేడుకున్నా" అని మురళీమోహన్‌ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాకు కుల, మత భేదాభిప్రాయాలు ఏమీ లేవు. అన్ని కులాలు, మతాల వారు బాగుండాలనే కోరుకుంటాను కానీ దేవుడికి కూడా కులాన్ని అంటగట్టే రకం కాదు. ఆరోజు ఏదో పొరపాటున నోరు జారాను. అందుకే స్వామి వారిని క్షమాపణలు వేడుకున్నాను. అలాగే తన పొరపాటును భక్తులందరూ మన్నించి క్షమిస్తారని ఆశిస్తున్నాను అని ఈ సందర్భంగా మురళీ మోహన్ విజ్ఞప్తి చేశారు. 


కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు డిమాండ్ తో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేపట్టిన దీక్ష గురించి మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని పేర్కొన్న మురళీ మోహన్.. సీఎం రమేశ్‌ చేస్తున్న దీక్ష విజయవంతం కావాలని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు.