ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో టీడీపీ ఎంపీలు నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. విభజన హామీల అమలు కోరుతూ గాంధీ విగ్రహం వద్ద నిలబడి ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. రోజుకో గెటప్‌లో ఆకట్టుకుంటున్న చిత్తూరు ఎంపీ నారమల్లి శివప్రసాద్ ఈరోజు సత్యసాయి వేషధారణలో నిరసన తెలిపారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


'నేను అనంతపురం జిల్లాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా భక్తులను సంపాదించుకున్నాను. ప్రజల హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాను. 2004లో మోదీ నా దగ్గరకు రాగా.. భవిష్యత్తులో ప్రధాని అవుతావని ఆశీర్వదించాను. కానీ ప్రధాని అయ్యాక మోదీ ఆ స్థాయికి తగ్గట్లుగా ప్రవర్తించడం లేదు. నాడు నేనిచ్చిన సందేశాలు ఆయనకు గుర్తుచేయడానికే ఇక్కడికి వచ్చాను.' అని అన్నారు. మోదీ ఇచ్చిన మాట తప్పుతారని, యోగాసనాలు వేస్తూ ఫోటోలకు ఫోజులిస్తారని అన్నారు. తెలుగు ప్రజలు తమ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోరని, జాగ్రత్తగా ఉండమని చెబుతున్నానని.. వాళ్లు క్షమించరని... పతనాన్ని చూస్తారని సత్యసాయి వేషధారణలో ఉన్న శివప్రసాద్‌ అన్నారు.


అటు అస్సాంలో ఎన్‌ఆర్‌సీ పేరుతో ప్రభుత్వం ప్రజల్లో భయాందోళనలు రేపుతోందని.. టీఎంసీ, ఆమ్ ఆద్మీ, సమాజ్ వాదీ పార్టీ సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు కూడా పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు.