న్యూఢిల్లీ : దక్షిణాదిన కర్ణాటకలో తప్ప ఇంకే ఇతర రాష్ట్రంలోనూ పాగా వేయలేకపోతున్న బీజేపి... రానున్న కాలంలోనైనా అక్కడ బలమైన శక్తిగా ఎదగాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపి అధ్యక్షుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో.. కొత్తగా నియమించబోయే అధ్యక్షుల ఎంపికకు సైతం పార్టీ అధిష్టానం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వెంటనే అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. తొలుత ప్రతిపక్ష స్థానంలోకి రావాలని.. ఆ తర్వాతే తమ బలాన్ని మరింత పెంచుకోగలమని బీజేపి భావిస్తోంది. అందులో భాగంగానే రెండు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల నుంచి సామాజికంగా వివిధ వర్గాలకు చెందిన ముఖ్యనేతలు, కేడర్‌ను తమవైపు తిప్పుకోగలిగే శక్తి, సామర్థ్యాలున్న బీజేపి నేతలను అధ్యక్ష పదవిలో నియమించాలని చూస్తోన్న పార్టీ అధిష్టానం.. ప్రస్తుతం నేతల ఒడబోత కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఏపీకి బీజేపి అధ్యక్ష పదవి కోసం పురందేశ్వరి, రాంమాధవ్ పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణనే మరొకసారి కొనసాగించాలనే వాదనలూ వినిపిస్తున్నప్పటికీ... పార్టీ అధిష్టానం మాత్రం రామ్ మాధవ్ వైపే మొగ్గుచూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. 


ఇక తెలంగాణలో పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయానికొస్తే... ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న డా లక్ష్మణ్‌నే మరొక పర్యాయం కొనసాగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే, లోక్ సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఊపుమీదున్న టీఆర్ఎస్ పార్టీ నేతలను ఓడించి గెలిచిన బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి నాయకుల పేర్లను సైతం పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు టాక్ బలంగా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించిన ఆ ఇద్దరు నేతలకు యువతలోనూ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం. అయితే, ఆ ఇద్దరూ పార్టీకి కొత్త వారు కావడం, రాష్ట్ర స్థాయిలో పని చేసిన అనుభవం లేకపోవడం వంటివి వారికి మైనస్ పాయింట్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌ని మరొకసారి అధ్యక్ష పదవిలో కొనసాగించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..