కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న ఏపీలో ఖాళీ ఏర్పడిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తాజా షెడ్యూల్ ను అనసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేత  కరణం బలరాం, వైసీపీ నేతలు ఆళ్లనాని, కోలగట్ట వీరభద్రస్వామి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇటీవలె జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం వల్ల వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ ఏర్పడిన మూడు స్థానాల్లో ఎన్నికలు అనివార్యమయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎమ్మెల్యే కోటాలో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ  ఎన్నిక‌లు కావ‌టంతో ఈ మూడు స్థానాలు వైసీపీ హస్తగతం చేసుకునే అవకాశముంది. అధికార పార్టీ హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 151 మంది శాస‌న‌స‌భ్యుల బ‌లం ఉంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీకి కేవ‌లం 23 మంది స‌భ్యుల సంఖ్యా బ‌లం మాత్ర‌మే ఉంది. దీంతో  మూడు స్థానాలు అధికార వైసీపీకే ద‌క్కటం ఖాయంగా క‌నిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ నేపథ్యంలో పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు తెలిసిన బడా నేతలతో పార్టీ చీఫ్ కు రాయబారాలు పంపుతున్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి జగన్ అంతిమంగా ఎవరిని కరుణిస్తారు... ఎవరు ఎన్నికల బరిలో ఉంటారు...అంతిమంగా ఎవరు ఎన్నికవుతారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.