Visakhapatnam: కల్యాణ మండపం నుంచి బంధువులు పరుగులు.. కారణం ఏంటంటే..?
Visakhapatnam Wedding Hall: విశాఖపట్నంలోని ఓ కల్యాణ మండపంలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుక జరుగుతుండగా.. కల్యాణ మండపంలోని ఓ ఫ్లోర్‌లో టైల్స్ వాటంతటే అవే పగిలిపోయాయి. దీంతో వధూవరులతోపాటు అందరూ బయటకు పరుగులు తీశారు.
Visakhapatnam Wedding Hall: ఆ కల్యాణ మండపంలో పెళ్లి వేడుక సందడిగా జరుగుతోంది. బంధువులు అంతా కబుర్లు చెప్పుకుంటూ గడుపుతున్నారు. కొందరు భోజనాలు చేస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా అందరూ భయపడిపోయారు. ఏమైందో ఏమో.. ఒక్కసారిగా ఫ్లోర్‌లోని టైల్స్ ఒక్కొక్కటి పగిలిపోయాయి. దీంతో ఏం జరుగుతుందోనని భయంతో వధూవరులతో సహా బంధువులు అందరూ బయటకు పరుగులు తీశారు. విశాఖలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా..
విశాఖపట్నం జిల్లా చినముషిడివాడకు చెందిన చిరంజీవి, మౌనికలకు రెండు కుటుంబాల పెద్దలు పెళ్లి నిశ్చయించారు. శుక్రవారం తెల్లవారుజామున 5.15 గంటలకు ముహుర్తం ఫిక్స్ చేశారు. వివాహ వేడుకకు స్థానికంగా ఉన్న దాట్ల కల్యాణ మండపాన్ని బుక్ చేశారు. గురువారం బంధువులు, స్నేహితులు అందరూ కల్యాణ మండపానికి చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో అందరూ భోజనాలు చేస్తుండగా.. ఫ్లోర్‌లోని టైల్స్ పగిలిపోయి ఎగిరిపడ్డాయి. అంతేకాకుండా శబ్ధం కూడా వచ్చింది.
దీంతో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. అందరూ భయపడుతూ.. బయటకు పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కల్యాణ మండపం వద్దకు చేరుకుని లోపలకు వెళ్లి పరిశీలించగా.. టైల్స్ పగిలిపోయి ఉన్నాయి. కళ్యాణ మండపంలో నాలుగు ఫ్లోర్లు ఉండగా.. మొదటి ఫ్లోర్‌లో మాత్రమే పగిలిపోయాయి. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికి అంతుచిక్కలేదు. అనంతరం పెళ్లి వారి కోసం మరో కల్యాణ మండపాన్ని రెడీ చేసి.. వివాహం జరిపించారు.
ఈ సందర్భంగా వధువు సోదరి మాట్లాడుతూ.. చినముషిడివాడ శారదాపీఠం పక్కనున్న పోర్టు కల్యాణ మండపానికి 45 రోజుల క్రితం బుక్ చేశామన్నారు. అయితే శారదాపీఠం వార్షికోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ వస్తున్నారని.. సడెన్‌గా కల్యాణ మండపం ఇవ్వలేమని నిర్వాహకులు చెప్పారని తెలిపారు. దీంతో కల్యాణ మండపం మార్చాల్సి వచ్చిందన్నారు. కానీ ఈ కల్యాణ మండపంలో ఇలా జరిగిందన్నారు.
Also Read: Bank Holidays: బ్యాంక్ వినియోగదారులకు ముఖ్యగమనిక.. రేపటి నుంచే వరుసగా సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook