టీడీపీకి మద్ధతు పలికిన టీఆర్ఎస్!!
లోక్‌సభలో బుధవారం ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.
లోక్‌సభలో బుధవారం ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయపరమైన అంశాల్లో కత్తులు దూసుకుంటున్న టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకే స్వరం వినిపించిన సన్నివేశం అది. అవును, ఇటీవల కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని గత రెండు, మూడు రోజులుగా పార్లమెంట్‌లో నిరసన చేపడుతున్న టీడీపీ ఎంపీల ఆందోళనకు బుధవారం టీఆర్ఎస్ వైపు నుంచి మద్దతు లభించింది.
లోక్ సభలో నిరనన వ్యక్తంచేస్తోన్న టీడీపీ సభ్యుల వాదనతో ఏకీభవిస్తున్నట్టుగా మహబూబ్‌నగర్ ఎంపీ, టీఆర్ఎస్ సభ్యుడు జితేందర్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన సమయంలో హామీలు ఇచ్చిన విధంగానే విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయాలని జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏయే పథకాలు, కార్యక్రమాలకు ఎంత కేటాయించారనేది రాష్ట్ర బడ్జెట్‌లో అటువంటిది చాలా స్పష్టంగా ఉంటుంది, కానీ కేంద్ర బడ్జెట్‌లో మాత్రం ఆ స్పష్టత కొరవడిందని జితేందర్‌రెడ్డి కేంద్రంపై తమ అసంతృప్తి వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ టీడీపీతో కలిసి రావడంతో ఆ పార్టీకి లోక్‌సభలో ఒకింత అండ లభించినట్టయింది.
అయితే, ఏపీకి న్యాయం చేయాలని టీఆర్ఎస్ కోరడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఓ సందర్భంలో ఏపీ ఎంపీల వాదనకు టీఆర్ఎస్ మద్దతు పలికింది.