మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాగుబోతులు ధర్నా చేస్తే ప్రభుత్వాలే పడిపోతాయని ఆయన అన్నారు. రూ.8.50లకు తయారయ్యే మద్యం బాటిల్‌ను రూ.50లకు అమ్ముతూ ప్రభుత్వం మిగతా డబ్బులు దోచుకు తింటుందని ఆయన ఆరోపించారు. అన్యాయాలు అనేవి ఈ ఒక్క విషయంలోనే కాదని.. చాలా విషయాల్లో జరుగుతున్నాయని.. ప్రభుత్వం వీటికి బాధ్యత వహించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 నాలుగేళ్లలో లక్షా 30 వేల కోట్లు అప్పు చేశారని.. వీటి లెక్కలేమిటో తెలియజేయాలని ఉండవల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాయతీగా పాలన చేయలేకపోతున్నారని.. చంద్రబాబు పద్ధతులను స్విట్జర్లాండ్‌ ఆర్థికవేత్త సైతం వ్యతిరేకించారని, ఆయన లెక్కలు చెబితే బాబును జైల్లో పెట్టే అవకాశం ఉందని ఉండవల్లి పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని ఉండవల్లి సూచించారు. 


ఉండవల్లి అరుణ్ కుమార్  రాజమండ్రి నియోజకవర్గం నుండి 14వ, 15వ లోక్‌సభలకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. గతంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలకు ఆయన అనువాదకునిగా కూడా పనిచేశారు. "ఈవారం" అనే పత్రికను కూడా ఆయన ప్రారంభించారు. తాజాగా అమరావతి బాండ్లు వడ్డీరేట్లపై కూడా ఉండవల్లి స్పందించారు. ట్యాక్స్‌ ఎంతో తెలియకుండా బాండ్లు ఎలా జారీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎక్కువ శాతం వడ్డీలకు అప్పు తీసుకొనే దిశగా సర్కారు ఎందుకు పయనిస్తుందని ఆయన తెలిపారు.