అమరావతి: ఏపీ పోలీస్ శాఖలో 11,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఏపీ పోలీసు నియామక మండలి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 11,500 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక మండలి తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 2020 జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ వెలువడనున్న నేపథ్యంలో పోలీసు శాఖలో ఉన్న ఖాళీల వివరాలను వెల్లడిస్తూ నియామక మండలి ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపించింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో 340 సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు ఉండగా మరో 11,356 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2018లో విడుదల చేసిన నోటిఫికేషన్‌తో 3 వేల ఉద్యోగాల భర్తీ పూర్తి కావడంతో మరోసారి వచ్చే ఏడాది చేపట్టబోయే నియామకాల ద్వారా వీలైనన్ని ఖాళీలను భర్తీ చేయాలని పోలీసు నియామక మండలి భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి మండలి తరపున ఈ ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం.


ఈ ఏడాది జూన్‌ నుంచి రాష్ట్రంలోని పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పోలీసు సిబ్బంది అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఆ అవసరాలకు అనుగుణంగా ఖాళీల భర్తీ చేపట్టాలని నియామక మండలి కోరినట్టు తెలుస్తోంది.