న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఏపీ విభజన హామీల విషయమై సభ్యులు తీవ్ర స్థాయిలో జరిపిన చర్చల్లో పలువురి వ్యాఖ్యలతో భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు కొంత అసహనానికి గురయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆనాడు పార్లమెంటులో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ప్రతి అంశానికి మీరు కూడా ప్రత్యక్ష సాక్షులేనని కొందరు సభ్యులు పేర్కొనడంతో వెంకయ్య నాయుడు ఒకింత అసహనానికి లోనయ్యారు. 'నాకన్నీ తెలుసు. సభలో ఆరోజు ఏం జరిగిందో..  ఏయే హామీలు ఇచ్చారో తెలుసు. ఎవరికి అన్యాయం జరిగిందీ తెలుసు. కానీ నేనిప్పుడున్న పరిస్థితులలో ఏమీ మాట్లాడలేను. ఒక రాజ్యసభ ఛైర్మన్‌గా నా అభిప్రాయాలను చెప్పలేను' అని నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఎంత వారించినా సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తుండటంతో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.


తొలుత చర్చను ప్రారంభించిన టీడీపీ కేంద్రం విభజన హామీల విషయంలో ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించింది. విభజన జరిగి నాలుగేళ్లు గడిచినా విభజన హామీలు అమలు కావడం లేదని పేర్కొంది. అటు కాంగ్రెస్ కూడా ఏపీని సానుభూతితో చూడాలని, విభజన హామీల అమలులో కేంద్రం విఫలమైందని పేర్కొంది. టీడీపీకి మద్దతుగా ఎస్పీ, టీఎంసీ, బీజేడీతో పాటు పలు రాజకీయ పక్షాలు మద్దతునిచ్చాయి. ఏపీకి హోదా ఇచ్చామని.. మోదీ సర్కార్ దానిని అమలుచేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అన్నారు. ప్రభుత్వం తరఫున కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లబ్ది కంటే ఎక్కువ సహాయాన్ని ఆంధ్ర ప్రదేశ్‌కు తాము చేస్తున్నామని తెలిపారు. 90శాతం హామీలను ఇప్పటికే అమలు చేశామని, పోలవరం జాతీయ ప్రాజెక్టు అని.. అందుకు రూ.6,754 కోట్లిచ్చామని, రైల్వేజోన్‌ కచ్చితంగా వస్తుందని… రాజకీయాలొద్దని అన్నారు. హోదా సంజీవని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నారని రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో గుర్తుచేశారు.