AP CM YS Jagan: అమరావతి: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్.. రాబోయే కాలంలో ఇదే 4G సేవలను 5G కి అప్‌గ్రేడ్ చేయనున్నట్టు స్పష్టంచేశారు. 209 మారుమూల ప్రాంతాల గ్రామాలకు సేవలు అందనున్నాయి. సీఎం జగన్ ప్రారంభించిన జియో టవర్లలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్‌ జిల్లాలో 2 టవర్లు ఉన్నాయి. రిలయెన్స్‌ జియో సంస్థ ఈ టవర్లను ఏర్పాటు చేసింది. 
 
రిలయన్స్ జియో టవర్ల ఏర్పాటు కారణంగా మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు మరింతగా మెరుగుపడనున్నట్టు సీఎం వైయస్ జగన్ తెలిపారు. ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ మరింత కనెక్టివిటీ, మెరుగైన నాణ్యతతో సేవలు అందనున్నాయని అన్నారు. విద్యార్థులకు ఇ–లెర్నింగ్‌ సేవలు అందనున్నాయి. ఆర్థికంగానూ ఆయా ప్రాంతాలకు మరింత లబ్ధి చేకూరనుందని సీఎం జగన్ పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో సెల్‌ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. మొబైల్, ఇంటర్నెట్‌ సర్వీసులు ద్వారా  మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకూ వారి ముంగిటకే సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం... అందులో భాగంగా యూనివర్సిల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) ద్వారా సెల్‌టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సెల్‌ టవర్ల పరిధిలో 150 ఎంబీపీఎస్‌ డౌన్లోడ్, 50 ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ చేసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది.


ఈ సందర్భంగా సీఎం వైయస్‌. జగన్‌ ఏమన్నారంటే... 
అందరికీ అభినందనలు. కేంద్ర ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్స్‌ విభాగానికి, రిలయన్స్ జియోకు, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిరికీ ధన్యవాదాలు. డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయి. దీంతో అన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, స్కూళ్లకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లభిస్తుంది. రేషన్‌ పంపిణీ, ఇ–క్రాప్‌ బుకింగ్‌ కూడా సులభమవుతుంది. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు అందించగలుగుతాం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.