జాతీయ రాజకీయాల్లో టీడీపీ స్టాండ్ ఏంటి ?
బీజేపీతో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో టీడీపీ పాత్ర ఎలా ఉంటుంది ?
విభజన హామీలపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ కేంద్ర కేబినెట్ నుంచి బయటికి వచ్చిన టీడీపీ ముందు కింకర్తవ్యం ఏంటి ?.. జాతీయ రాజకీయాల్లో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతోందనే అంశం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందున్న ఆప్షన్లు ఒక్క సారి పరిశీలిద్దాం
కేసీఆర్ థార్డ్ ఫ్రంట్ : ఎన్డీయే కూటమితో దాదాపు సంబంధాలు తెంచుకున్న చంద్రబాబుకు..కేసీఆర్ థార్డ్ ఫ్రంట్ ఆప్షన్ లా కనిపిస్తోంది. అయితే ఈ థార్డ్ ఫ్రంట్ కు ఇప్పటి వరకు ఒక రూపం రాలేదు. కేసీఆర్ తో కలిసి ఫ్రంట్ ఏర్పాటుకు చంద్రబాబు కృషి చేయాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో టీడీపీని భూస్తాపితం చేసిన కేసీఆర్ తో దోస్తీ కట్టడం అసాధ్యమని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు ప్రస్తుత పరిణామాలు థార్డ్ ఫ్రంట్ బలపడటానికి అనుకూల వాతావరణం లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
కాంగ్రెస్ తో దోస్తీ: చంద్రబాబు ముందున్న రెండో ఆప్ఫన్ కాంగ్రెస్ తో దోస్తీ చేయడం. రాష్ట్రంలో టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు ఏ పార్టీలు మొగ్గుచూపడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే ఇటు రాష్ట్రంలో బలపడుతూ..జాతీయ స్థాయిలోనూ బలం పెంచుకునే అవకాశముంది. అయితే కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పురుడుపోసుకున్న పార్టీ టీడీపీ. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీడీపీ పయనించడం సాధ్యమయ్యే పనికాదంటున్నారు విశ్లేషకులు. విభజన దోషిగా ముద్రపడ్డ కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే టీడీపీని ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం లేదు .కాబట్టి చంద్రబాబు ఈ ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి
స్వతంత్రంగా వ్యవహరించడం: చంద్రబాబు ముందున్న మరో ఆప్షన్ స్వతంత్రంగా వ్యవహరించడం. రాష్ట్ర అవసరాలను బట్టి చూస్తే జాతీయ స్థాయిలో సపోర్టు తీసుకోవడం అనివార్యం. ఈ నేపథ్యంలో ఎవరితో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించమనేది మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఎన్డీయేతో దోస్తీ కొనసాగింపు : మోడీ కేబినెట్ నుంచి మాత్రమే టీడీపీ వైదొలిగింది కానీ ఎన్డీయే ప్రభుత్వానికి తన మద్దతు ఉప సంహరించుకోలేదు. మోడీ సర్కార్ ను ఒత్తిడిలోకి నెట్టేందుకే చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మోడీ సర్కార్ దిగి వచ్చి ప్యాకేజీపై కానీ.. ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తే మళ్లీ టీడీపీ-బీజేపీ బంధం కొనసాగే అవకాశాలున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి
తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి ఆప్షన్ ఎంచుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.