ఎమ్మెల్యేల ఆదాయంలో టాప్5లో జగన్
ఎమ్మెల్యేల ఆదాయంలో టాప్5లో జగన్
ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దేశంలోనే 5వ స్థానంలో నిలిచారు. ఈ మేరకు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయం, వృత్తిపై సర్వే నిర్వహించి ప్రజాస్వామ్య సంసంస్కరణల సంఘం (ఏడీఆర్) నివేదిక విడుదల చేసింది.
కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఆదాయం రూ.18.13 కోట్లుగా ఉందని ఏడీఆర్ పేర్కొంది. టీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రూ.10.76కోట్లతో 8వ స్థానంలో, టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ.8.61కోట్లతో 10వ స్థానంలో, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి రూ.7.96కోట్ల ఆదాయంతో 14వ స్థానంలో ఉన్నారంది.
కాంగ్రెస్ చెందిన బెంగళూరు (రూరల్) ఎమ్మెల్యే ఎన్.నాగరాజు రూ.157. 04 కోట్ల ఆదాయంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. దేశంలోనే అత్యల్ప వార్షిక ఆదాయం కలిగిన ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన శింగనమల ఎమ్మెల్యే యామినీబాల అని ఏడీఆర్ వెల్లడించింది.ఆమె వార్షిక వ్యక్తిగత ఆదాయం రూ.1301మాత్రమే అని పేర్కొంది. కాగా అత్యధిక ఆదాయం కలిగిన ఎమ్మెల్యేలు ఎక్కువగా తమ వృత్తి వ్యవసాయం అని చెప్పారని ప్రొఫెసర్ జగ్దీప్ ఛోకర్ తెలిపారు.
కాగా.. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల సగటు ఆదాయం రూ.24.59 లక్షలుగా ఉన్నట్లు, కర్ణాటక ఎమ్మెల్యేల సగటు అత్యధికంగా రూ.1.1. కోట్లుగా, ఛత్తీస్‌గఢ్‌లో ఎమ్మెల్యేల సగటు రూ.5.4 లక్షలు అని నివేదిక తెలిపింది.