ప్యాకేజీ ఒప్పుకొనేందుకు చంద్రబాబు ఎవరు?: వైఎస్ జగన్
టీడీపీ అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం తమను తీవ్ర నిరాశపర్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు.
టీడీపీ అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం తమను తీవ్ర నిరాశపర్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జగన్ శుక్రవారం లోక్‌సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంపై మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. తిరుపతి సభలో ఆయన చెప్పిన హామీలు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పరిణామాలను నిశితంగా పరిశీలించామని.. చర్చలో కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదన్నారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చకు సమాధానం ఇచ్చిన మోదీ నోటి వెంట ప్రత్యేక హోదా ఇస్తామన్న ఒక్క మాట రాలేదని జగన్ చెప్పారు. చంద్రబాబు ఆమోదంతోనే హోదాకు బదులు ఏపీకి ప్యాకేజీ ప్రకటించామని మోదీ చెప్పారు. అసలు ప్యాకేజీకి ఒప్పుకొనే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని జగన్ నిలదీశారు. ప్రత్యేక హోదా 5 కోట్ల ఏపీ ప్రజల హక్కు అని జగన్ అన్నారు. హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు, పరిశ్రమలు వస్తాయన్నారు. హోదాపై రాజీపడడానికి చంద్రబాబు ఎవరు? అని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా అవసరం లేదని నాడు టీడీపీ మహానాడులో తీర్మానం చేశారని, ప్యాకేజీ ప్రకటించిన అరుణ్‌జైట్లీకి కృతజ్ఞతలు తెలిపి.. ప్యాకేజీ బాగుందని అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని జగన్ గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై తాము మాట్లాడుతుంటే హేళన చేశారని.. హోదా ఏమన్నా సంజీవనా అంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. టీడీపీ నాలుగేళ్లు బీజేపీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి.. ఇప్పుడు డ్రామాలు ఆడుతోందని వైఎస్ జగన్ మండిపడ్డారు.
ఏపీకి ఇచ్చిన హామీలను 4 ఏళ్లుగా నెరవేర్చలేదని.. పార్లమెంటులో గల్లా జయదేవ్ మాట్లాడిన మాటలు గత నాలుగేళ్లుగా మేం చెబుతున్న మాటలేనని..అవే అంశాలను తాము మాట్లాడితే వెక్కిరించారని జగన్ అన్నారు. ఓ వైపు బీజేపీపై యుద్ధం అంటూనే ఈ పార్టీతో చంద్రబాబు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్నారు.
'ఏం సాధించారని ఢిల్లీ వెళ్లి చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడుతారు? అవిశ్వాసంపై చర్చలో ఎవరైనా ఏపీకి హోదా కావాలని అన్నారా? ఇకనైనా చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించాలి. వాళ్ళు నిరాహార దీక్షకు దిగితే నేను మా ఎంపీలను పంపిస్తా. అప్పుడే దేశం మనవైపు చూస్తుంది. కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాం' అని జగన్ అన్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 24న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.