వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రిగా నేడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేయనున్న ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రిగా నేడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేయనున్న ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా నేటి మధ్యాహ్నం 12:23 గంటలకు ''జగన్ అనే నేను'' అంటూ వైఎస్ జగన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జగన్ చేత ప్రమాణస్వీకారం చేయించడానికి ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారమే విజయవాడ చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సహా దేశం నలుమూలల నుంచి పలు ఇతర ప్రముఖులు జగన్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అతిథులుగా హాజరు కానున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జిని సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పటికీ.. ఆమె ఇక్కడకు రాలేకపోతున్నానని తెలియజేస్తూ ఫోన్‌లోనే జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
జగన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో విజయవాడ, అమరావతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. స్టేడియంలో నుంచే 30,000 మంది ప్రత్యక్షంగా ప్రమాణస్వీకారాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేయగా.. వివిధ కారణాలతో స్టేడియంలోపలికి రాలేకపోయిన వారు సైతం బయటి నుంచే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేశారు.