Ys Sharmila Satires: అసెంబ్లీకు వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామా చేయండి
Ys Sharmila Satires: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి అన్నపై విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరం కావడంపై ఆమె స్పందించారు. ఇంట్లో కూర్చునేందుకో లేదా సొంత మైకుల్లో మాట్లాడేందుకో ప్రజలు ఓట్లేయలేదని షర్మిల ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Sharmila Satires: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించడంపై ఆమె మండిపడింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకు హాజరౌతానని చెప్పడం అవివేకం, అజ్ఞానానికి నిదర్శనమన్నారు. మీ స్వయం కృతాపరాధం వల్లే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.
అసెంబ్లీ అనేది దేవాలయమని, ప్రజలు, ప్రజల సమస్యలకు అధికార పార్టీని నిలదీసేందుకు వేదికని అలాంటి అసెంబ్లీలో అడుగెట్టననడం సరైంది కాదన్నారు వైఎస్ షర్మిల. అన్న జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఎక్స్‌లో వరుస పోస్ట్‌లు చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలకు, మేనిఫెస్టో హామీలకు దిక్కులేదని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోందని, మహిళలలపై దాడులు కొనసాగుతున్నాయని, ఇసుక మాఫియా చెలరేగుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 5 నెలలు కావస్తున్నా ఒక్క ఉద్యోగం లేదని, రోజురోజుకూ నిరుద్యోగ సమస్య పెరుగుతోందన్నారు. ఇన్ని జరుగుతున్నా ప్రజల పక్షాల అసెంబ్లీలో నిలదీయాల్సింది పోయి, ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తాననడం సిగ్గుచేటన్నారు.
1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కోల్పోయినా మీ లెక్కన హోదా కావాలంటూ మారం చేయలేదని ధైర్యంగా ప్రజల పక్షంగా నిలబడిందని గుర్తు చేశారు. ఆనాడు ఎన్నో సమస్యలపై తెలుగుదేశానికి కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపించిందన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీకు కేంద్రంలో 44 సీట్లే వచ్చినా 2019లో 52 సీట్లే వచ్చినా ఎప్పుడూ ప్రతిపక్ష హోదా కోసం ఆడగలేదన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రజా సమస్యలపై గొంతు విన్పించారని చెప్పారు. మోదీ నియంతృత్వాన్ని ఎండగట్టారన్నారు. దేశ ప్రజల సమస్యపై కాంగ్రెస్ గొంతుకగా మారిందన్నారు. ఇప్పటికైనా పిచ్చితనం పక్కనబెట్టి అసెంబ్లీ వెళ్లాలని సూచించారు. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని కోరారు. అసెంబ్లీకు వెళ్లే ధైర్యం లేకుంటే మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు.
Also read: AP Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు రేపట్నించి ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.