ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే దిశగా పోరాడుతోన్న ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ.. తమ పార్టీ ఎంపీల రాజీనామాల విషయంలో మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన మరుక్షణమే తాము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా వున్నామని ఆ పార్టీ ఎంపీలు ఇవాళ మరోసారి తేల్చిచెప్పారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల గ్రామంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శిబిరం వద్దే ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయిన పార్టీ ఎంపీలు.. ఆ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేస్తోన్న పోరాటంలో భాగంగా ఇకపై పార్టీ ఎంపీలు అవలంభించనున్న విధి, విధానాలు, భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

" సమావేశాల చివరి రోజు వరకు సభలో చర్చ కోసం పట్టుపడుతూనే ఉంటాం. కేంద్రం నుంచి హోదాపై ప్రకటన రానట్లయితే, పార్లమెంట్‌ సమావేశాల చివరిరోజున తాము తమ పదవులకు రాజీనామాలు చేస్తాం. ఒకవేళ ఈ లోపే సభ నిరవదికంగా వాయిదాపడితే.. ఆ మరుసటి నిమిషమే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పిస్తాం" అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు పలు సూచనలు చేశారని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీలు స్పష్టంచేశారు.


తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా వున్నారు అని ప్రకటించిన వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగు దేశం పార్టీ సైతం తమతో కలిసి వస్తే బాగుంటుందని అన్నారు. ఒకప్పుడు హోదానే వద్దన్న చంద్రబాబు ఇప్పుడు తన నిర్ణయం మార్చుకుని వైఎస్సార్సీపీతో కలిసి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా రాజీనామాల విషయంలోనూ వైఎస్సార్‌సీపీతోపాటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే దేశవ్యప్తంగా ప్రత్యేక హోదా అంశం సంచలనం రేపుతుందని, ఫలితంగా కేంద్రంపై ఒక రకంగా ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.