చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలి : వైఎస్సార్సీపీ
ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయాలి : భూమన కరుణాకర్ రెడ్డి
ఓటుకు నోటు కేసు చార్జిషీటులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏ1గా పేర్కొని అతడిని తక్షణమే అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. బుధవారం ఆ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. '' వాస్తవానికి చంద్రబాబు నాయుడు పేరును ఈ కేసులో నిందితుడిగా ఎప్పుడో చేర్చాల్సి వుంది కానీ ఏవో కారణాలతో అది ఆలస్యమవుతూ వచ్చింది" అని అన్నారు. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక వెలువడిన నేపథ్యంలో ఇకనైనా దేనికి వెనుకాడకుండా చంద్రబాబు నాయుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పేరుని చార్జిషీట్‌లో నమోదు చేయడానికి తగిన ఆడియో, వీడియో ఆధారాలు వున్నప్పటికీ ఇంకా అతడిని నిందితుడిగా పేర్కొనడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర వుందని యావత్ దేశం విశ్వసిస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడిని ఎవ్వరూ రక్షించలేరు అని బల్లగుద్ది మరీ చెప్పిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. గత మూడేళ్ల నుంచి ఈ కేసుపై తగిన విధంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి సందేహం వ్యక్తంచేశారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు రాజీపడినందు వల్లే హైదరాబాద్‌ని 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా వినియోగించుకోకుండా హైదరాబాద్‌ని విడిచిపెట్టి పారిపోయారు. అంతేకాకుండా ఈ కేసు నుంచి తప్పించుకునేందుకుగాను రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలోనూ చంద్రబాబు రాజీపడ్డారు అని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఏదేమైనా మరోసారి ఓటుకు నోటు కేసు వ్యవహారం తెరపైకొచ్చినందున.. చంద్రబాబు నాయుడు పేరుని చార్జిషీటులో పేర్కొని అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని భూమన డిమాండ్ చేశారు.
ఏపీ ప్రతిపక్ష పార్టీ చేస్తోన్న ఈ డిమాండ్‌పై తెలంగాణ సర్కార్ ఏమని స్పందించనుందో వేచిచూడాల్సిందే మరి.