ఢిల్లీకి వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అక్కడ వైసిపి ఎంపీ రఘురామ కృష్టంరాజు(YSRCP MP Raghurama Krishnam Raju) ఇంట్లో ఉన్నారని వస్తున్న వార్తలపై స్వయంగా సదరు వైసిపి ఎంపీనే స్పందించారు. పవన్‌‌ తన ఇంట్లో ఉన్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదన్న రఘురామ కృష్ణంరాజు.. పవన్ అంటే ఎంతో ఇష్టమని అంగీకరించారు. చిరంజీవి కుటుంబం అంటేనే ఇష్టమని... అలాగే పవన్ తాను ఒకరినొకరం పరస్పరం గౌరవించుకుంటామని తెలిపారు. నాగబాబుతో తనకు మధ్య కొన్ని మాటల యుద్ధం జరిగినప్పటికీ.. వ్యక్తిగతం, రాజకీయాలు రెండూ వేరేనని అభిప్రాయపడ్డారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సైతం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం జగన్‌కు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కావాలనే కొంతమంది ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో తాను ఏపీ సర్కార్‌కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు వచ్చిన వార్తలను సైతం ఆయన తప్పుపట్టారు. తెలుగు భాషని పరిరక్షించమని విజ్ఞప్తిచేస్తూ లోక్ సభలో మాట్లాడటం జరిగిందే తప్ప తాను ఎక్కడా ఇంగ్లీష్ మీడియంను వద్దనలేదే అని ఆయన ఎదురు ప్రశ్నించారు. తాను మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను సీఎం జగన్ చూశారో లేదో తనకు తెలియదు కానీ ఆయన నాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు రావడంలో అర్థం లేదని అన్నారు. 


ఒక వ్యాపార వేత్తగా, రాజకీయ నాయకుడిగా తనకు చాలా పరిచయాలు ఉంటాయని.. అలాగే ఇటీవల చంద్రబాబు ఎదురైనప్పుడు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడారని చెబుతూ.. అంత మాత్రానికే తాను టీడీపీలో చేరిపోతానా అని ఎంపీ రఘు రామకృష్ణంరాజు విస్మయం వ్యక్తంచేశారు. ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.