Highest Salary in Tata Group: అతడు తమిళనాడులోని మోహనూరు అనే గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి. చిన్నప్పుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న విద్యార్థి. తల్లిదండ్రులది వ్యవసాయ నేపథ్యం. వ్యవసాయం చేసుకుంటేనే బతికే కుటుంబం అది. అందుకే తను కూడా చదువుకుంటూ సమయం ఉన్నప్పుడల్లా వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలిచిన వ్యక్తే. ఊరిలో చదువులు పూర్తయ్యాకా కొయంబత్తూరులోని కొయంబత్తూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. ఆ తరువాత తిరుచిరాపల్లిలోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) పూర్తి చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న అనంతరం టీసీఎస్ కంపెనీలో ఇంటర్న్‌గా ఉద్యోగంలో చేరాడు. అక్కడే చిత్తశుద్ధితో పనిచేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎదుగుతూ వచ్చాడు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత సీన్ కట్ చేస్తే అతడే ఆ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ప్రమోషన్ అందుకున్నాడు. 1987 లో టీసీఎస్ కంపెనీలో ఇంటర్న్ గా చేరిన ఎన్ చంద్రశేఖరన్.. 2007 సెప్టెంబర్ లో అదే కంపెనీకి సీఓఓ అయ్యాడు. సరిగ్గా మరో రెండేళ్లకు.. అంటే 2009 అక్టోబర్ లో టీసీఎస్ కంపెనీ సీఈఓ అయ్యాడు. అప్పుడు చంద్రశేఖరన్ వయస్సు 46 ఏళ్లు.


మనం చెప్పుకుంటున్న ఈ ఎన్ చంద్రశేఖరన్ మరెవరో కాదు.. ప్రస్తుతం టాటా గ్రూప్ చైర్మన్‌గా కొనసాగుతున్న ఎన్ చంద్రశేఖరన్ పూర్తి పేరు నటరాజన్ చంద్రశేఖరన్. 2017 లో ఎన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ సంస్థకు చైర్మన్ అయ్యాడు. 2019 లో చైర్మన్ హోదాలో అతడి జీతం రూ. 65 కోట్లు. 2020 లో చంద్రశేఖరన్ ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ. 98 కోట్లు పెట్టి డూప్లెక్స్ బంగ్లా కొన్నాడు. ఈ బంగ్లా ఉండేది ఎక్కడో తెలుసా.. వరల్డ్స్ రిచెస్ట్ బిలియనీర్స్‌లో ఒకరైన ముఖేష్ అంబాని ఉండే ఆంటిలియాకు సమీపంలోనే చంద్రశేఖరన్ బంగ్లా కూడా ఉంది. 2021-22 ఏడాదిలో చంద్రశేఖరన్ వేతనం రూ. 109 కోట్లకు పెరిగింది. అంటే రోజుకు అతడి వేతనం రూ. 30 లక్షలు. నెలకు రూ. 90 లక్షలు అన్నమాట. 


చంద్రశేఖరన్‌కి మీడియా ముందుకు రావడం అంటే కొంచెం సిగ్గు. కానీ నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చిన " వర్కింగ్ : వాట్ వి ఆల్ డే " అనే డాక్యుమెంటరీకి మాత్రం బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. తన కెరీర్ తొలినాళ్లలో తండ్రితో కలిసి వ్యవసాయం పనుల్లో పాల్గొనేవాడినని.. కానీ అది తన జీవితం కాదు అని గట్టిగా అనిపించేదని.. ఇంకేదో చేయాలి అనే తపనతోనే ఐటి రంగంలోకి వచ్చి ఈ స్థాయికి ఎదిగిన విషయాన్ని నటరాజన్ చంద్రశేఖరన్ చెప్పుకొచ్చాడు. చంద్రశేఖరన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. తనకు తాను మాత్రమే ఎదిగిన వ్యక్తి కాదు... టీసీఎస్ కంపెనీతో పాటు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన ఒకి యోగి. బిజినెస్ సర్కిల్స్‌లో చంద్రశేఖరన్ సమకాలీకులు అతడిని ముద్దుగా చంద్ర అంటారు. 


వారెవ్వా.. ఒక కంపెనీలో ఇంటర్న్‌గా చేరి అదే కంపెనీలో చైర్మన్ అవడం అంతా ఒక సినిమా స్టోరీలా ఉంది కదా.. కానీ ఇదొక రియల్ స్టోరీ.. మన కళ్ల ముందు నిలిచిన ఇన్‌స్పైరింగ్ స్టోరీ. 1963 లో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, అంతులేని ఉన్నత స్థాయికి ఎదిగిన నటరాజన్ చంద్రశేఖరన్ జీవితం.. మన దేశంలోనే కాదు... యావత్ ప్రపంచంలోనే ఎంతో మందికి స్పూర్తిధాయకం. నేను పల్లెటూర్లో పుట్టాను.. నేను సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదివాను అంటూ జీవితంలో ఏమీ సాధించకుండా మిగిలిపోయి తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునే వారికి ఇదొక చెంపపెట్టులాంటి కథనం.