How to Check Your CIBIL Score on Google Pay: గతంలో ఎవరైనా తమ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి అంటే అది కేవలం బ్యాంకుల వల్లే సాధ్యపడేది. కస్టమర్స్ ఏదైనా లోన్ కోసం కానీ లేదా క్రెడిట్ కార్డు కోసం కానీ దరఖాస్తు చేసినప్పుడు ఆయా బ్యాంకులు సదరు వ్యక్తి సిబిల్ స్కోర్ చెక్ చేసి ఆ స్కోర్ ఆధారంగా నిర్ణయం తీసుకునే వారు. ఇంకా చెప్పాలంటే చాలా సందర్భాల్లో ఆ సిబిల్ స్కోర్ ఎంత అనేది కూడా బయటికి వెల్లడించే వాళ్లు కాదు. కానీ ఆ తరువాత కొన్ని స్టాక్ బ్రోకర్ కంపెనీలు, ట్యాక్స్ కన్సల్టెంట్స్ గట్రా కొంత ఛార్జ్ తీసుకుని సిబిల్ స్కోర్ చెప్పడం ప్రారంభించాయి. ఇప్పుడు ఏకంగా కొన్ని లోన్ యాప్స్ కావొచ్చు లేదా గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్ కావొచ్చు తమ యాప్ యూజర్స్ కి ఉచితంగానే సిబిల్ స్కోర్ అందిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవును, ఇప్పటివరకు పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్స్, మొబైల్ రీచార్జ్, టీవీ రీచార్జ్, ఓటిటి రీచార్జ్, క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్స్, లోన్ రీపేమెంట్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి సేవలను అందించిన గూగుల్ పే ఇటీవలే సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే ఫీచర్‌ని సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. 


సిబిల్ స్కోర్ అంటే.. ఒక వ్యక్తి ఆర్థిక స్తోమతను అంచనా వేసేందుకు అతడి గత ఆర్థిక లావాదేవీలు, లోన్స్, రీపేమెంట్స్ హీస్టరీ ఆధారంగా క్రోడీకరించి 300 నుండి 900 మధ్య ఒక స్కోర్ ని నిర్ణయిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సిబిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తి తన జీవితంలో ఆర్థిక వ్యవహారాలలో ఎంత బాధ్యతతో, క్రమశిక్షణతో ఉన్నారు అనేది సూచిస్తుంది. అందుకే బ్యాంకులు కూడా ఈ సిబిల్ స్కోర్ ఆధారంగా చేసుకునే దరఖాస్తుదారులకు రుణం మంజూరు చేసే యోగ్యత ఉందా లేదా అని బేరీజు వేసుకుంటాయి. వారి గత హిస్టరీతో పాటు ప్రస్తుతం ఉన్న సిబిల్ స్కోర్ ఆధారంగానే వారికి లోన్స్ కానీ లేదా క్రెడిట్ కార్డు కానీ ఇవ్వవచ్చా లేదా అని నిర్ణయం తీసుకుంటాయి. అంతేకాకుండా ఎంత ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే వారికి అంత తక్కువ వడ్డీ రేట్లతో రుణం లేదా క్రెడిట్ కార్డులు అప్రూవ్ అవుతుంటాయి. అందుకే అప్పుడప్పుడు మీరే మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుని దానిని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించడం మంచి అలవాటు. అనే భావింవచ్చు. 


గూగుల్ పే యాప్‌లో సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేయొచ్చంటే ..
మీ మొబైల్లో గూగుల్ పే యాప్‌ని ఓపెన్ చేయండి.
స్క్రీన్ లో కనిపించే వివరాలను నావిగేట్ చేస్తూ కిందివైపునకు వెళ్తే అక్కడ మీకు మేనేజ్ యువర్ మనీ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
ఆ కిందనే చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఒకవేళ మీరు మొదటిసారి ఇక్కడ సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నట్టయితే, మీ ఫోన్ నంబర్, పాన్ నెంబర్ అడుగుతుంది. ఆ వివరాలు ఇవ్వండి.
ఆ వివరాలు నమోదు చేసిన తర్వాత మీ మొబైల్ స్క్రీన్ పై మీ క్రెడిట్ స్కోర్ ప్రత్యక్షం అవుతుంది. 
సిబిల్ స్కోర్ కనిపించడమే కాకుండా అందులో ఏవైనా సమస్యాత్మక లావాదేవీలు ఉండి, అవి మీ స్కోర్ పై దుష్ప్రభావం చూపిస్తున్నట్టయితే. ఆ వివరాలు కూడా వెల్లడిస్తుంది. అవి మీరు సరిచేసుకోవడం ద్వారా మీరు మీ స్కోర్ పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది.