Consumer Gets Nirma Soap In iPhone Box: న్యూఢిల్లీ: ఐఫోన్ కోసం ఆర్డర్ చేసిన కస్టమర్‌కి ఐఫోన్‌కి బదులుగా నిర్మా డిటర్జెంట్ సోప్‌తో పాటు చిన్న కీప్యాడ్ ఫోన్ డెలివరీ అయిన ఘటనలో కన్సూమర్ కమిషన్ ఫ్లిప్‌కార్ట్‌కి మొట్టికాయలేసింది. అంతేకాకుండా వినియోగదారుడిని ఇబ్బందులకు గురిచేసి మానసికంగా వేధించినందుకుగాను ఫ్లిప్‌కార్ట్‌కి, వినియోగదారుడికి ఐఫోన్ విక్రయించిన రీటేలర్‌కి రూ. 25 వేల జరిమానా విధించింది. ఆన్‌లైన్ విక్రయాల సేవలో లోపం, మోసపూరిత పద్ధతిలో వ్యాపారం చేసినందుకుగాను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, రిటైలర్‌కు కన్సూమర్ కమిషన్ ఈ జరిమానా విధించింది. అంతేకాకుండా ఐఫోన్ కొనుగోలు కోసం కస్టమర్ వెచ్చించిన రూ. 48,999 మొత్తాన్ని 8 నెలల్లోగా వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగానూ కన్సూమర్ కమిషన్ స్పష్టంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్నాటకలో జిల్లా కేంద్రమైన కొప్పల్ పట్టణానికి చెందిన ఎస్ హర్ష అనే స్టూడెంట్ ఆన్‌లైన్‌లో ఐఫోన్ కోసం ఆర్డర్ చేశాడు. ఐతే, తనకు యాపిల్ ఐఫోన్‌కు బదులు చిన్న కీప్యాడ్ కలిగిన ఫోన్, నిర్మా సబ్బు పంపారని ఫిర్యాదు చేస్తూ ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు తనకు ఫోన్ విక్రయించిన సేన్ రిటైల్స్‌కు వ్యతిరేకంగా కొప్పల్‌లోని జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. 2021 నాటి ఈ కేసులో తాజాగా కన్సూమర్ కమిషన్ స్పందిస్తూ ఈ తీర్పు వెలువరించింది. 


ఆన్‌లైన్ అమ్మకాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇలా మోసపూరితమైన పనులకు పాల్పడం తగదని, వినియోగదారులను మోసం చేసే హక్కు ఎవ్వరికీ లేదని కోర్టు కన్సూమర్ కమిషన్ అభిప్రాయపడింది. ఎస్ హర్ష వివాదంలో ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అతడికి ఐఫోన్ విక్రయించిన రిటేలర్ ఈ తప్పిదానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషన్ స్పష్టంచేసింది. కొనుగోలు చేసిన వస్తువుకు బదులుగా మరో వస్తువును పంపడం మోసపూరితమైన లావాదేవీల కిందకే వస్తుందని పేర్కొన్న కమిషన్.. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు సదరు రీటైలర్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది.