Want Beautiful Girls For Enjoyment: అతడి వయస్సు 71 ఏళ్లు. ఎకౌంటెంట్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. విశ్రాంత జీవితం గడుపుతున్న అతడికి ఓరోజు సెల్ ఫోన్ లో ఓ మెసేజ్ వచ్చింది. స్నేహం కోసం, ఎంజాయ్ మెంట్ కోసం అందమైన అమ్మాయిలను కనెక్ట్ చేస్తాం అనేది ఆ మెసేజ్ సారాంశం. అందమైన అమ్మాయిలు అనగానే అతడు వెనుక, ముందు ఏమీ ఆలోచించలేదు. వెంటనే ఆ నెంబర్ కి కాల్ బ్యాక్ చేశాడు. అందమైన గొంతుతో ఉన్న ఓ లేడీ ఆ ఫోన్ ఎత్తి ఆన్సర్ చేసింది. యంగ్ అండ్ బ్యూటీఫుల్ గాళ్స్ ఫోటోలు పంపిస్తాం.. అందులో మీకు ఇష్టమైన వారిని ఎంచుకోండి అని అందంగా సెలవిచ్చింది. అయితే, అంతకంటే ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని.. అందుకోసం రూ. 2100 చెల్లించాలని చెప్పింది. అప్పుడు తెలియలేదు ఆమె లేడీ గొంతుతో ఉన్న కిలేడీ అని. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫోన్‌లో ఆ లేడీ చెప్పినట్టుగానే ఆమెకు రూ. 2100 పంపించి అందమైన అమ్మాయితో స్నేహం, ఎంజాయ్‌మెంట్ కోసం తన పేరును నమోదు చేసుకున్నాడు. అది మొదలు అతడు ఏవేవో కలలు కంటూ ఊహల్లో తేలిపోయాడు.. కానీ అవతల సీన్ వేరే ఉంది. అక్కడి నుంచే అతడిని దోచుకోవడం మొదలైంది. మార్చి 23న అందమైన అమ్మాయి కోసం అతడు తన పేరు నమోదు చేసుకోగా.. ఏప్రిల్ 4 వరకు అమ్మాయితో డేటింగ్ అంటూ, హోటల్ బిల్స్ అంటూ రకరకాల సాకులు చెప్పి వివిధ సందర్భాల్లో అతడి నుంచి రూ. 4.5 లక్షల వరకు దోచుకున్నారు. అందమైన అమ్మాయి డేటింగ్ కి వస్తోందనే భ్రమలో ఉన్న ఆ వృద్ధుడు.. వాళ్లు అడిగినప్పుడల్లా, అడిగినంత మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చాడు. అలా వాళ్లు తనకు నాలుగున్నర లక్షల మేర కుచ్చుటోపీ పెట్టాకే తాను మోసపోయానని గ్రహించిన వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు.


ముంబైలోని సమతా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. థాకూర్ కాంప్లెక్స్ లో ఉంటున్న వృద్ధుడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న డిపాజిట్స్ మొత్తం అయిపోయాయి. అయినా అవతలి లేడీ ఇంకా ఇంకా డబ్బులు చెల్లించాల్సిందిగా వేధిస్తుండటంతో చివరకు స్నేహితుల వద్ద కుంటిసాకులు చెప్పి అప్పులు కూడా చేశాడు. మొదట్లో అందమైన అమ్మాయిల కోసం ఆశపడి ఈ వృద్ధుడు వారి వెంటపడ్డాడు. కానీ ఎప్పుడైతే వృద్దుడిలో ఆశ చూశారో.. అప్పటి నుంచి రకరకాల చార్జీల పేరుతో ఏవేవో పేమెంట్స్ చేయాల్సిందిగా వేధించడం ఆ చీటింగ్ గ్యాంగ్ వంతయ్యింది. తన దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. అందినకాడికి అప్పులు కూడా చేశాడు. అయినా అతడికి అమ్మాయి దొరక్కపోగా.. ఇంకా వేధింపులు ఎక్కువ అవుతుండటంతో అప్పుడు అర్థమైంది తాను మోసపోయానని. ఇంకా తాను దాచుకుంటే ఇక బతకడం కష్టమేనని భావించిన ఆ వృద్ధుడు.. తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు.


వృద్ధుడి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 419, 420, ఐటి యాక్టులోని సెక్షన్ 66 (సి, డి) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి ఏ బ్యంకుకి అయితే డబ్బులు బదిలీ అయ్యాయో.. ఆ బ్యాంకు ఖాతాలు ఏ అడ్రస్ పేరిట ఉన్నాయో చెప్పాల్సిందిగా బ్యాంకులకు లేఖలు రాశామని.. ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. అందమైన అమ్మాయిల కోసం వేసిన వలలో చిక్కుకున్న వృద్ధుడు.. ఈ వయస్సులో తాను దాచుకున్న డబ్బులను పోగొట్టుకోవడమే కాకుండా మరిన్ని అప్పులు కూడా చేసి ఎన్నో తిప్పలపాలయ్యాడు. ఈ ఘటన ఏం సందేశం ఇస్తుందో ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.