Volunteer Arrested: సంక్షేమ పథకాల కోసం ఫోర్జరీ.. వాలంటీర్ అరెస్ట్
Volunteer Arrested in Forgery Case: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలనే దురుద్దేశంతో ఆయా పథకాలకు అవసరమైన ధృవపత్రాల స్థానంలో నకిలీ ధ్రవపత్రాలు తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ఉదంతం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది.
Volunteer Arrested in Forgery Case: అనకాపల్లి : ప్రభుత్వం అందించే పథకాలను అక్రమంగా పొంది లబ్ధి పొందడం కోసం వాలంటీర్ తో పాటు ముగ్గురు సచివాలయం ఉద్యోగులు అడ్డదారులు తొక్కిన ఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో చోటుచేసుకుంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలనే దురుద్దేశంతో ఆయా పథకాలకు అవసరమైన ధృవపత్రాల స్థానంలో నకిలీ ధ్రవపత్రాలు తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ఉదంతం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది. కార్యదర్శి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
అచ్యుతాపురం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీకి చెందిన సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ సహాయకుడు సుధీర్ కి ఇంకా పెళ్లి కాలేదు. కానీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల వల్ల కలిగే లబ్ధిని పొందాలని చూసిన సుధీర్ తన వద్ద ఉన్న డిజిటల్ కీ ఉపయోగించి తనకి పెళ్లయినట్టుగా నకిలీ వివాహపత్రం సృష్టించుకున్నాడు. అదే సచివాలయంలోని మహిళా పోలీసులు బురుగుబెల్లి రాజేశ్వరి, పైలా వెంకటలక్ష్మి భర్తలతో కలిసి ఉంటున్నారు. కానీ వితంతు పెన్షన్ తో పాటు ఒంటరి మహిళలకు ప్రభుత్వం నుండి అందే ఆర్థిక ప్రయోజనాల కోసం వారు తమ భర్తతో కలిసి ఉంటున్నప్పటికీ విడాకులు తీసుకున్నట్టుగా నకిలీ పత్రాలు తయారుచేసుకున్నారు.
ఈ అక్రమ బాగోతం గురించి పసిగట్టిన గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యదర్శి ఫిర్యాదుతో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వారికి సహకరించిన వాలంటీర్ నానాజీపై కేసు నమోదు చేసిన అచ్యుతాపురం పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. ప్రస్తుతానికి ముగ్గురు మహిళా పోలీసులు చేసిన తప్పుడు పనికి సహకరించిన సచివాలయం సిబ్బంది, వాలంటీర్ పైనే చర్యలు తీసుకున్నప్పటికీ.. ఆ తరువాత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి, అడ్డదారిలో ప్రభుత్వం సొమ్మును కాజేసేందుకు కుట్ర చేసిన ముగ్గురు మహిళా పోలీసులపైనా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.