Serial Chain Snatching Case Updates: హైదరాబాద్ రాచకొండ పరిధిలో చైన్ స్నాచర్లు మరోసారి తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. మహిళలని టార్గెట్ చేసుకొని బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. వాకింగ్ చేస్తున్న మహిళలు... ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళలు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను తెల్లవారుజామున సమయంలో రెండు గంటలలో ఆరు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌ వాసులను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జంట నగరాల్లో దాదాపు రెండు గంటల వ్యవధిలోనే 6 చోట్ల మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఉదయం 6 గంటల 20 నిమిషాల నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు వేర్వేరు ప్రదేశాల్లో ఈ చైన్ స్నాచింగ్స్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉప్పల్‌ పరిధిలోని రాజధాని థియేటర్ ప్రాంతంతో పాటు కల్యాణ్‌పురి, నాచారంలోని నాగేంద్రనగర్‌, ఓయూలోని రవీంద్రనగర్‌, చిలకలగూడలోని రామాలయం గుండు, రాంగోపాల్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో ఆగంతుకులు మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఉదయం ఉప్పల్‌లో మొదలుపెట్టి.... సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌ వరకు వరుసగా 6 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు.


సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌ కృష్ణానగర్‌కాలనీలో జ్యోతిబిన్‌ అనే మహిళ 8 గంటల సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా... ఆమెను వెంబడించిన దుండగులు ఆమె మెడలో ఉన్న గొలుసును అపహరించుకెళ్లారు. చిలుకానగర్‌లోని మరో మహిళపై నుంచీ బంగారు నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. 


ఓయూ పరిధిలోని రవీంద్రనగర్‌లో జానకమ్మ అనే వృద్ధురాలు ఇంటి ముందు పూలు తెంపుతుండగా.... వెనక నుంచి పల్సర్‌ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అడ్రస్‌ అడుగుతూ దగ్గరకు వచ్చారు. ఆమె మాట్లాడుతుండగానే గొలుసు తెంపుకుని ఉడాయించారు. నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాగేంద్రనగర్‌లో ఇంటి ముందు విమల అనే వృద్ధురాలు ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా... ఇద్దరు వ్యక్తులు పువ్వులు కావాలంటూ దగ్గరకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె దృష్టి మరల్చి మెడలో ఉన్న 5 తులాల బంగారం గొలుసును లాక్కెళ్లారు.


బాధితుల ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. ఈ దొంగలు ఢిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వేస్టేషన్లు వద్ద నిఘా ఏర్పాటు చేసి.. అనుమానితులను, ఇతర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను అలెర్ట్ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై.. అన్ని రైల్వే స్టేషన్లపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే కాజీపేట రైల్వేస్టేషన్లో ఇద్దరు అనుమానితులను వరంగల్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏది ఏది ఏమైనా సరే... బంగారపు వస్తువులతో నగరంలోని వృద్ధులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం వేళల్లో ఒంటరిగా బయటకు రావొద్దని పోలీసులు సూచించారు. దుండగుల ముఠా ఢిల్లీకి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.