NIA Cash Reward: కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో చోటుచేసుకున్న బాంబు ఘటనలో ఇంకా విచారణ జరుగుతోంది. ఆ ఘటనలో జరిగిన పరిణామాలు దేశాన్ని నివ్వెరపరిచిన విషయం తెలిసిందే. పేలుళ్ల కేసును కర్ణాటక ప్రభుత్వం జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. అయితే బాంబు పెట్టిన వ్యక్తి ఎవరో కనుక్కునే పనిలో పోలీస్‌ బృందాలు, విచారణ సంస్థలు ఉన్నాయి. నిందితుడిని సీసీ కెమెరాల్లో గుర్తించారు. కానీ అతడి వివరాలు లభించలేదు. అతడి ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు. బాంబు పెట్టే సమయంలో అతడు అన్నీ జాగ్రత్తలు పాటించాడు. ముఖం, తల కనిపించకుండా టోపీ, మాస్క్‌, కళ్లజోడు ధరించాడు. దీంతో అతడిని గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల్లో అతడు కనిపించిన దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. అయితే అతడిని పట్టుకుంటే మాత్రం ఊహించని విధంగా రూ.10 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించడం విశేషం. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: D Raja: భారత్‌ ఒక దేశమే కాదు.. తమిళనాడు ఒక దేశం: ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు


అతడి ఆచూకీ పట్టించిన వారికి ఆ నగదు బహుమతి ఇస్తామని ఎన్‌ఐఏ ప్రకటించింది. 'పై చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తికి సంబంధించిన ఎలాంటి వివరాలైనా.. అతడి అరెస్ట్‌కు సహకరించిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతి ఇస్తాం. వివరాలు వెల్లడించిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతాం. అతడి ఆచూకీ కనిపిస్తే 080-29501900, 89042 41100 నంబర్‌లలో కానీ, info.bir.nia@gov.in అనే మెయిల్‌కు కానీ సంప్రదించవచ్చు' అని ఎన్‌ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు పోస్టు కూడా చేయవచ్చని చిరునామా వెల్లడించింది. ఆ ప్రకటనలో క్యాప్‌ ధరించి నడుచుకుంటూ వెళ్తున్న అనుమానితుడి ఫొటోను విడుదల చేశారు. నలుపు రంగు ప్యాంట్‌, సిమెంట్‌ రంగు చొక్కా ధరించి చేతికి వాచ్‌, కాళ్లకు బూట్లు వేసుకుని ఉన్నాడు. అతడి మాదిరిగా కనిపించిన వ్యక్తుల సమాచారం కూడా ఇవ్వవచ్చని ఎన్‌ఐఏ సూచించింది.


Also Read: River Metro: దేశంలోనే తొలిసారిగా జలమార్గంలో మెట్రో రైలు.. నదిలో రైలు విశేషాలు ఇలా


ఈనెల 1వ తేదీన బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణపాయం సంభవించకపోయినా దాదాపు పది మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం మొదట గ్యాస్‌ సిలిండర్‌ పేలుడుగా భావించారు. కానీ అలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో మరింత విచారణ చేయగా బాంబు పేలుడుగా తేలింది. నిందితుడు తినడానికి వచ్చినట్టు చేసి తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను వదిలి వెళ్లాడు. అనంతరం వెంటనే బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. రద్దీ ఉండే ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. 


కాగా నిందితుడి ఆచూకీ కోసం ఇతర రాష్ట్రాలకు కూడా సమాచారం పంపారు. అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం తెలపాలని ఎన్‌ఐఏ విజ్ఞప్తి చేసింది. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని విచారణ సంస్థ చెబుతోంది. అసలు నిందితుడు బాంబు పెట్టడానికి గల కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుడు దొరికితేనే బాంబు పేలుళ్ల వెనుక కారణం, అతడి వెనుక ఎవరున్నారనేది తెలియనుంది. ఎన్‌ఐఏకి పూర్తిగా సహకరించేందుకు కర్ణాటక పోలీస్‌ శాఖ సిద్ధమైంది. పక్కా ప్రణాళికతో నిందితుడు బాంబు పెట్టి వెళ్లాడని.. అతడు విదేశాలకు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రజల సహకారం కోరుతూ తాజాగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. అతడి ఆచూకీ చెప్పిన వారికి భారీగా నగదు బహుమానం ప్రకటించడం గమనార్హం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి