SBI Gold Missing Case In Srikakulam: శ్రీకాకుళం జిల్లా గార మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో బంగారం మాయమైన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చోరీపై అనుమానాలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందటంతో ఖాతాదారులలో ఆందోళన నెలకొంది. సిబ్బంది పొంతన లేని సమాధానాలతో తనకున్న నమ్మకమైన సేవల గుర్తింపును పోగొట్టుకోవడంతో పాటు, ఇప్పుడు పోలీసు కేసు కూడా నమోదు అవ్వడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. తమ వ్యవసాయ పెట్టుబడుల కోసం బంగారం కుదువ పెట్టి రైతులు లోనులు తీసుకుంటే.. బ్యాంక్ సిబ్బంది మాత్రం తమ హస్తలాగావాన్ని ప్రదర్శించి.. ఆ బంగారాన్ని బ్యాంకు దాటించిన ఘటన కలకలం రేపుతోంది. గార మండల కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ ఈ గోల్ మాల్‌కు వేదికగా మారింది. సిబ్బంది చేతివాటం చూపించి ఏకంగా ఏడు కిలోల బంగారు ఆభరణాలను మాయం చేసేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడచిన కొద్ది నెలలుగా ఈ తంతు చాప కింద నీరులా జోరుగా సాగుతున్నప్పటికీ ఎవరికీ అనుమానం రాలేదు. అయితే  కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఖాతాదారులు తాము తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణం చెల్లించి ఆభరణాలను తిరిగి ఇవ్వమని అడగడంతో బండారం బయట పడింది. ఆభరణాలు ఎంతకూ ఇవ్వకపోవడంతో బ్యాంకు సిబ్బందితో వాదనకు దిగారు. దీంతో మూడు నాలుగు రోజుల్లో ఆభరణాలిస్తామని చెప్పి అప్పటికి పంపేశారు. విషయం బయటకు పాకడంతో ఆ బ్యాంకులో బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకున్న వారందరూ ఐదు రోజుల క్రితం ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన స్టేట్‌బ్యాంక్‌ ఉన్నతాధికారులు గార బ్రాంచ్‌లో ఆడిట్‌ ప్రారంభించారు.


ఎస్‌బీఐ ఉన్నతాధికారులు సైతం దగ్గర ఉండి ఆడిట్ విధానాన్ని పర్యవేక్షించారు. ఖాతాదారులు బంగారు ఆభరణాల గురించి ఆందోళన చెందవద్దని.. ఆడిట్‌ నిర్వహిస్తున్నామని డిసెంబరు 8న ఖాతాదారులందరికీ ఆభరణాలు చూపిస్తామన్నారు. రుణం చెల్లించిన వారికి ఆభరణాలు ఇచ్చేస్తామని నచ్చజెప్పారు. అంతటితో ఖాతాదారులు శాంతించి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సెలవులో ఉన్న గార ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌ స్వప్నప్రియ ఆత్మహత్యాయత్నం చేసి గడచిన బుధవారం తెల్లవారుజామున విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఇక్కడితో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అప్పటివరకు బంగారు ఆభరణాలను డిసెంబరు 8న అందజేస్తామని ప్రకటించిన బ్యాంకు అధికారులు.. ఆమె మరణం తర్వాత హఠాత్తుగా పోలీసులను ఆశ్రయించారు. 


గార ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఖాతాదారులు కుదువపెట్టిన ఏడు కిలోల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని.. వీటి విలువ రూ.4.07 కోట్ల పైబడి ఉంటుందని ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌ రాజు గురువారం పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఇందులో ఆరుగురు బ్యాంకు సిబ్బంది పాత్ర ఉందని వివరించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.


Also Read: Animal Movie Leaked: యానిమల్ టీమ్‌కు భారీ షాక్.. అప్పుడే ఆన్‌లైన్‌లోకి ఫుల్‌మూవీ


Also Read: CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి