Aatagallu movie review | ఆటగాళ్ళు మూవీ రివ్యూ
ఆటగాళ్ళు మూవీ రివ్యూ
నటీనటులు : నారా రోహిత్, జగపతి బాబు, దర్శని బానిక్, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు
ఛాయాగ్రహణం : విజయ్.సి.కుమార్
సంగీతం : సాయికార్తీక్
నిర్మాతలు : వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర
స్క్రీన్ ప్లే -దర్శకత్వం : పరుచూరి మురళి
విడుదల తేది : 24 ఆగస్ట్ 2017
నారా రోహిత్ – జగపతి బాబు కాంబినేషన్‌లో తెర్కకెక్కిన ‘ఆటగాళ్ళు’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పరుచూరి మురళి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా ? నారా రోహిత్ – జగపతి బాబు ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌తో మెప్పించగలిగారా తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ :
చిన్న వయసులోనే అత్యున్నతమైన స్థాయికి ఎదిగిన సినిమా దర్శకుడు సిద్దార్థ్ (నారా రోహిత్) తన భార్య అంజలి(దర్శన బనిక్) హత్య కేసులో నిందుతుడిగా జైలుకి వెళ్తాడు. క్రిమినల్ లాయర్‌గా ఎల్లప్పుడూ న్యాయం తరపున నిలబడే వీరేంద్ర (జగపతిబాబు), డి.సి.పి నాయక్ (సుబ్బరాజు) సహాయంతో సిద్దార్థ్‌ను నిర్దోషిగా రుజువు చేసి ఆ కేసు నుండి బయటపడేస్తాడు. ఆ తర్వాత అంజలిని హత్య చేసిన వ్యక్తిని పోలీసులకు పట్టిస్తాడు సిద్దార్థ్. నేరం ఒప్పుకోవడంతో ఆ వ్యక్తికి న్యాయ స్థానం ఉరి శిక్ష అమలు చేస్తుంది. ఈ క్రమంలో క్రిమినల్ లాయర్ వీరేంద్రకి అంజలి హత్య కేసులో ఊహించని నిజాలు తెలుస్తాయి. అక్కడి నుండి ఎవరు ఎవరితో ఆటాడుకున్నారు ? చివరికి అంజలి హత్య కేసులో నిందితుడు ఎవరు ? అనేది ఆటగాళ్ళు సినిమా మిగతా కథాంశం.
నటీనటుల పనితీరు :
నారా రోహిత్ ఎప్పటిలాగే తన క్యారెక్టర్‌తో పరవాలేదనిపించుకున్నాడు. గత చిత్రాలకు ఈ సినిమాకు అతని నటనలో ఎటువంటి మార్పు కనబడదు. ఇప్పటికే ఎన్నో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న జగపతి బాబుకి, ఈ సినిమాలో పాత్ర పెద్ద పరీక్ష పెట్టదు. కాని ఉన్నంతలో జగపతి బాబు బెస్ట్ ఇచ్చాడు. సుబ్బరాజు తన క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ అనిపించాడు. బ్రహ్మానందం కామెడి వర్కౌట్ అవ్వకపోగా విసుగు తెప్పిస్తుంది. చలపతిరావు, నాగినీడు, ప్రియ, జీవ, సత్యం రాజేష్, ఫణి తదితరులు దర్శకుడు చెప్పింది చేస్తూ పోతూ సినిమాలో అటెండెన్స్ వేయించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు :
సినిమాకు కాస్తో కూస్తూ ప్లస్ అయ్యిందంటే అది సాయి కార్తీక్ ఒక్కడే.. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాకు ప్లస్ అయ్యాడు. ‘నీవల్లే నీవల్లే’ పాట మినహా మిగతా పాటలు ఆకట్టుకోలేకపోయాయి. విజయ్.సి.కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఎడిటింగ్ పరవాలేదు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. పరుచూరి మురళి తన స్క్రీన్ ప్లేతో దర్శకుడిగా అలరించలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో పరవాలేదు అనిపిస్తాయి.
ఇక దర్శకుడి విషయానికొస్తే అప్పట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించి హిట్స్ అందుకున్న పరుచూరి మురళి ప్రస్తుతం వరుస అపజయాలు అందుకుంటున్నాడు. దీనికి కారణం దర్శకుడిగా ఆయన కమర్షియల్ కథలను ఎంచుకుంటూ రెగ్యులర్ దారిలో వెళ్ళడమే. ఈ సినిమా విషయంలో కూడా పరుచూరి మురళి చేసింది అదే. సినిమా కోసం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథను ఎంచుకొని దానికి నారా రోహిత్, జగపతి బాబు లాంటి పెర్ఫార్మర్స్‌ను తీసుకొన్న పరుచూరి మురళి ఈ కథకి కొన్ని కమర్షియల్ హంగులు జోడిస్తూ, రెగ్యులర్ కామెడి, పాటలతో విసుగు తెప్పించాడు.
తొలి పదినిమిషాలు సినిమాపై ఆసక్తి కలిగించిన దర్శకుడు బ్రహ్మానందం కామెడి ట్రాక్‌తో ట్రాక్ తప్పాడు. దర్శకుడు ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ కొత్తదేం కాదు కానీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ కథను నడిపించొచ్చు. అక్కడే దర్శకుడి ప్రతిభ బయటపడేది. ముఖ్యంగా జగపతి బాబు -నారా రోహిత్‌లను కూడా పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాడు. సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే ప్రేక్షకులు బోర్ ఫీలవుతుంటారు. పోనీ ఇంటర్వెల్‌తో అయినా సినిమాపై ఆసక్తి కలిగించాడా అంటే అదీ లేదు.
కాకపోతే ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ మాత్రం కాస్త పరవాలేదనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా సెకండ్ హాఫ్‌లో క్యాట్ – మౌస్ గేమ్‌ని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు దర్శకుడు. తనకున్న అనుభవంతో ఆ సన్నివేశాలపై మరింత ఫోకస్ పెడితే సినిమా రిజల్ట్ ఇంకాస్త బెటర్‌గా ఉండేది. సినిమా మొత్తానికి హైలైట్ అవ్వాల్సిన ఆ గేమ్‌తో విసుగు తెప్పించాడు. నారా రోహిత్ క్యారెక్టర్, జగపతి బాబు పెర్ఫార్మెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సినిమాకు ప్లస్ అనిపించగా కథ, ట్విస్టులు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కామెడీ, సాంగ్స్ సినిమాకు మైనస్ అనిపిస్తాయి. మొత్తానికి ‘ఆటగాళ్ళు’ ప్రేక్షకులతో ఆడుకుంటారు.
రేటింగ్ : 1.5 /5
జీ సినిమాలు సౌజన్యంతో...